అరవ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. ప్రతిపక్షం డీఎంకే జూలు విదుల్చుతోంది. 'పన్నీర్ సెల్వంకి అవసరమైతే మద్దతిస్తాం..' అని ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన డీఎంకే, ఇప్పుడు ప్లేటు ఫిరాయిస్తోంది. 15 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకుంంది. 'పన్నీర్ సెల్వం, శశికళ తీరుతో విసిగిపోయాం..' అంటూ ఆ 15 మంది ఎమ్మెల్యేలు, డీఎంకేతో సంప్రదింపులు షురూ చేశారు. ఈ ఎపిసోడ్‌తో శశికళ వర్గంలో ఆందోళన మరింత తీవ్రమైంది.
నిండా మునిగినోడికి చలేంటన్నట్టుంది పన్నీర్ సెల్వం పరిస్థితి. ఎటూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేశారు గనుక, ఇప్పుడాయన కొండకు వెంట్రుకని ముడేసి లాగుతున్నారు. వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి పదవి వస్తుంది.. లేదంటే, వెంట్రుక పోతుందన్నది ఆయన థియరీ. ఏం జరిగినాసరే, చిన్నమ్మ శశికళను రాజకీయంగా దెబ్బకొట్టి తీరాల్సిందేనన్న పట్టుదలతో వున్నారాయన.
129 మంది ఎమ్మెల్యేలు తమ ఆధీనంలో వున్నారని అన్నాడీఎంకేలోని శశికళ వర్గం పైకి గట్టిగా చెబుతున్నా, 8 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వైపు వెళ్ళడం, ఇంకో 15 మంది డీఎంకే వైపు చూస్తుండడంతో ముఖ్యమంత్రి పదవిపై శశికళ ఆశలు వదిలేసుకోవాల్సిందే. మరోపక్క, పన్నీర్ సెల్వం వర్గంలో నిన్ననే చేరిన అన్నాడీఎంకే సీనియర్ నేత, పార్టీ అధ్యక్షురాలిగా శశికళ నియామకం చెల్లదంటూ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేయడం గమనార్హం. అదే సమయంలో, ఆయన్ను పార్టీ నుంచి తొలగిస్తూ శశికళ తొలగించడం ఈ రోజు తమిళ రాజకీయాల్లో మరో కీలక మలుపు.
ఈ వ్యవహారం ఇలా వుంటే, తమిళనాడు డీజీపీ - శశికళ వర్గం దాచేసిన ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేల ఆచూకీ వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది డీజీపీకి.
మొత్తమ్మీద, తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర గందరగోళం కొనసాగుతోంది. కప్పల తక్కెడని తలపిస్తున్న ఎమ్మెల్యేల తీరు.. ప్రజాస్వామ్యాన్నే పరిహిస్తోందన్నది నిర్వివాదాంశం.