వైకాపా వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌...?

ప్రశాంత్‌ కిశోర్‌ ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడటానికి, బిహార్లో నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రి కావడానికి, పంజాబ్‌లో కాంగ్రెసు అధికారంలోకి రావడానికి కారకుడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌. యూపీలో కాంగ్రెసు ఘోరంగా ఓడిపోయినప్పటికీ గుజరాత్‌ ఎన్నికల బాధ్యత ప్రశాంత్‌కే అప్పగించాలని ఆ పార్టీ నాయకత్వం ఆలోచిస్తోందంటే ఆయన ప్రాధాన్యత ఏమిటో తెలుస్తోంది. ఈ వ్యూహకర్త మీద వైఎస్సార్‌సీపీ దృష్టి పెట్టినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రశాంత్‌ను వ్యూహకర్తగా నియమించుకోవాలని వైఎస్సార్‌సీపీ ఆలోచిస్తోందా? అని ప్రశ్నించుకుంటే కొంతమేరకు 'అవును' అని సమాధానం చెప్పవచ్చు. ఇలా చెప్పుకోవడానికి కారణం వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమాచారం. అయితే ఇది వర్కవుట్‌ అవుతుందా? కాదా? అనేది అధినేత జగన్‌ తీసుకునే నిర్ణయాన్నిబట్టి ఉంటుంది.

ప్రశాంత్‌ కిషోర్‌ హైదరాబాదులో విజయసాయి రెడ్డిని కలుసుకున్నారు. ఆయన సాయిరెడ్డికి బాగా సన్నిహితుడట...! ఇద్దరు ప్రముఖులు కలుసుకున్నారంటే 'ఏదో ఉంది' అనుకోవడం మీడియాకు సాధారణమే. దీంతో ప్రశాంత్‌ కిషోర్‌ ఎందుకొచ్చారు? ఏ పని మీద వచ్చారు? వచ్చే ఎన్నికల గురించి మాట్లాడుకున్నారా?...ఇలాంటి ప్రశ్నలు తలెత్తాయి. దీంతో ఓ ఆంగ్ల పత్రిక విజయసాయి రెడ్డిని సంప్రదించినప్పుడు ప్రశాంత్‌ చాలా కాలంగా తనకు స్నేహితుడని, తన ఆహ్వానం మేరకు తనను కలుసుకోవడానికి వచ్చాడని సమాధానం ఇచ్చారు. తాము చాలా విషయాలు మాట్లాడుకున్నామని, అయితే ఆయన సేవలను వినియోగించుకునే విషయంలో చర్చించలేదని, నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పార్టీ అధినేత జగన్‌తో చర్చించాక ప్రశాంత్‌ కిషోర్‌ సేవలను వినియోగించుకునే విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. విజయసాయి రెడ్డి చెప్పిందాన్నిబట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో వ్యూహకర్తగా ప్రశాంత్‌ను నియమించుకోవాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే దక్షిణాదిలో ప్రశాంత్‌ను వినియోగించుకున్న మొదటి పార్టీ వైఎస్సార్‌సీపీ, మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అవుతాయి.

వచ్చే ఎన్నికలు షెడ్యూలు ప్రకారం 2019లో జరిగినా, 2018 చివర్లో జరిగినా వైకాపాకు అత్యంత కీలకం. మరో మాటలో చెప్పాలంటే జీవన్మరణ సమస్యని చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే దానికి మనుగడ ఉంటుంది. కాబట్టి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదల ఉండటం సహజం. పరిస్థితి కొంతమేరకు అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో పకడ్బందీ వ్యూహాలతో బరిలోకి దిగడం మంచిది. అందుకే ప్రశాంత్‌ కిషోర్‌పై దృష్టి సారించినట్లుగా ఉంది. ఒకవేళ ప్రశాంత్‌ వ్యూహకర్తగా రంగంలోకి దిగితే టీడీపీలో ఆందోళన కలుగుతుంది. చంద్రబాబుకు నిద్ర పట్టకపోవచ్చు.  ప్రశాంత్‌  విజయాల చరిత్ర ఆయనకు తెలుసు.  యూపీలో కాంగ్రెసు నాయకులు ప్రశాంత్‌ మాట వినకుండా 'ఓవర్‌ యాక్షన్‌' చేయడంతో పరాజయం పాలైంది.

ఆ విషయం అధిష్టానం గ్రహించింది కాబట్టి ప్రశాంత్‌ మీద నింద వేయలేదు. పైగా గుజరాత్‌లోనూ పనిచేయించాలనే ఆలోచన చేస్తోంది.  ప్రశాంత్‌ను వ్యూహకర్తగా పెట్టుకోవడం జగన్‌ పార్టీకి ప్రయోజనకరమే. ఒకవేళ పెట్టుకుంటే యూపీలో కాంగ్రెసు చేసిన తప్పు (అతిగా జోక్యం చేసుకొని, సొంత ఆలోచనలు చేసి) చేయకూడదు. జగన్‌ ఎవ్వరి మాట వినరని, ఎవ్వరి సలహాలు తీసుకోరనే ప్రచారం ఉంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. ఆయనకు అలాంటి స్వభావం ఉన్నట్లయితే దాన్ని మార్చుకొని ప్రశాంత్‌ కిషోర్‌తో కలిసి పనిచేస్తే విజయం సాధించే అవకాశాలుంటాయి. 'ది బాయ్‌ వండర్‌ ఆఫ్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌'గా మీడియా ప్రశంసించిన ప్రశాంత్‌ ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతాలు సృష్టించవచ్చేమో ఎవరికి తెలుసు?

Show comments