అపరిచితుడు సినిమాలో విక్రమ్ ఎలా మారిపోతుంటాడో మనందరం చూశాం. పైకి కనిపించని మరో విక్రమ్ అపరిచితుడి రూపంలో అతడిలో ఉంటాడు. రియల్ లైఫ్ లో ప్రభాస్ కూడా అలాంటి అపరిచితుడే. చాలామందికి తెలియని ఎన్నో కోణాలు ప్రభాస్ లో ఉన్నాయి. స్వయంగా దర్శకుడు రాజమౌళే.. ప్రభాస్ ను అపరిచితుడు అంటున్నాడు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజమౌళి.. ప్రభాస్ లోని ఓ చిన్న అపరిచితుడి కోణాన్ని మీడియాతో పంచుకున్నాడు. సెట్స్ పై భయంకరంగా కష్టపడే ఈ హీరో నిజజీవితంలో మాత్రం పరమ బద్దకస్తుడట. హీరోల్లో ప్రభాస్ అంత సోమరిపోతును తను ఎక్కడా చూడలేదంటున్నాడు రాజమౌళి. దీనికి సంబంధించి ఓ చిన్న ఇన్సిడెంట్ ను కూడా షేర్ చేసుకున్నాడు రాజమౌళి.
ముంబయి విమానాశ్రయం.. మరో 30నిమిషాల్లో విమానం బయల్దేరుతుంది. చెక్-ఇన్ అవ్వలేదు. ప్రభాస్ మాత్రం తీరిగ్గా లాంజ్ లో కూర్చున్నాడట. లాస్ట్ లో వెళ్దామంటూ ఎంత చెప్పినా కదల్లేదట. ఫ్లయిట్ మిస్ అయిపోతుందని అందర్లో ఒకటే టెన్షన్. ఎట్టకేలకు ఆఖరి ప్యాసింజర్ గా ప్రభాస్ విమానం ఎక్కాడట. ఇలా రియల్ లైఫ్ లో చాలా సందర్భాల్లో ప్రభాస్ తనలోని బద్ధకం కోణాన్ని తమకు చూపించాడని అంటున్నాడు రాజమౌళి.
అయితే ఎంత సోమరి అయినా సెట్స్ పైకి వచ్చేసరికి మాత్రం ప్రభాస్ పడే కష్టం చూస్తే ఆశ్చర్యమేస్తుందని అంటున్నాడు రాజమౌళి. ఈ హార్డ్ వర్క్ తో పాటు అందరితో ఓపెన్ గా సింపుల్ గా ఉండడం ప్రభాస్ కే సాధ్యమంటున్నాడు జక్కన్న.