జలం.. జలం.. రణరంగం.!

జీవ కోటికి ప్రాణాధారం జలం.. కానీ, అదే జలం ఇప్పుడు నిప్పులా మారింది. అవును, నీరు నిప్పులా మారిపోయి.. తగలబెట్టేస్తోంది. నీరు, నిప్పుని ఆర్పుతుంది. అది వెనకటి మాట. ఇప్పుడు నీరు, నిప్పుని రాజేస్తుంది. పచ్చగడ్డే అవసరం లేదు.. నీటితో కూడా తగలబెట్టేయొచ్చు. అయితే, ఇది ఆషామాషీ జలం కాదు.. రాజకీయ జలం. 

తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య నీటి వివాదం.. ఇరు రాష్ట్రాల్నీ తగలబెట్టేయబోతోంది. అవును నిజం. చిన్న నిప్పు రవ్వలా మొదలైన నీటి వివాదం, ఇప్పుడు అగ్ని కీలలుగా మారిపోయింది. ఇరు రాష్ట్రాల్లోనూ రైతులు, సామాన్యులు నీటి కోసం 'నిప్పు'ని వాడుతున్నారు. ఇదిప్పటి వివాదం కాదు. స్వాతంత్య్రం రాక ముందు నుంచీ వున్న వివాదమే. అయితే, ఇప్పుడు కొత్తగా వివాదం ముదిరి పాకాన పడిందంతే. 

సుప్రీంకోర్టు తీర్పుతో కర్నాటక రాష్ట్రం, కావేరీ జలాల్ని తమిళనాడుకి విడుదల చేస్తోంది. అంతే, కర్నాటక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై బైఠాయించారు. బస్సుల్ని, ఇతర వాహనాల్నీ ధ్వంసం చేశారు. దానికి ప్రతిగా తమిళనాడులోనూ ఆందోళనలు ముదిరి పాకాన పడ్డాయి. తమిళనాడులో కర్నాటకకి చెందిన ఓ హోటల్‌ని ఆందోళనకారులు తగలబెట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. 'మీరేనా, మేం తగలబెట్టలేమా.?' అంటూ కర్నాటకలోనూ తమిళ హోటల్‌పై ఆందోళనకారులు దాడి చేశారు. 

కర్నాటక రాజధాని బెంగళూరులో ఇప్పుడు 144 సెక్షన్‌ విధించారు. ఎటు చూసినా పోలీసులే. ఎక్కడ ఏ క్షణాన పరిస్థితులు ఎలా మారతాయో తెలియక పౌరులు భీతిల్లుతున్నారు. ఇంతా జరుగుతున్నా కేంద్రం చోద్యం చూస్తోంది. ఇంకోపక్క సుప్రీంకోర్టు, 'మేం ఇచ్చిన తీర్పుని శిరసావహించాల్సిందే.. పౌరుల ఆందోళనలపై జాగ్రత్తగా వ్యవహరించండి.. పరిస్థితిని చక్కదిద్దండి' అంటూ కర్నాటకకు ఆదేశాలు జారీ చేసింది.  Readmore!

ప్రస్తుతానికి ఈ వివాదం తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకే పరిమితం. కానీ, దేశంలో చాలా రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై వివాదాలున్నాయి. విభజన క్రమంలో యూపీఏ సర్కార్‌ వ్యవహరించిన నిర్లక్ష్య వైఖరి కారణంగా, నాగార్జున సాగర్‌ డ్యామ్‌పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన పోలీసులు, అధికారులు, రైతులు కొట్టుకున్న విషయాన్ని ఎలా మర్చిపోగలం.? 

ఈ పరిస్థితుల్లో కేంద్రమే రంగంలోకి దిగాలి. కానీ, కేంద్రం జల వివాదాల విషయంలో చోద్యం చూస్తోంది. 'కేంద్రం కల్పించుకోవాలి..' అంటూ రాష్ట్రాలు నెత్తీనోరూ బాదుకుంటున్నా ఉపయోగంలేదు. ఎందుకంటే, 'కరవమంటే కప్పకి కోపం.. విడవమంటే పాముకి కోపం..' అన్నట్లుంటాయి పరిస్థితులు. ఆ పరిస్థితుల్ని సృష్టించే రాజకీయమే, ఇప్పుడా పరిస్థితుల్ని చూసి, 'నాకెందుకొచ్చిందీ గొడవ' అని తప్పించుకోవడమే నేటితరం రాజకీయం.

Show comments