'అఖిల్‌' హీరోయిన్‌కి ఇంకో ఛాన్స్‌

అక్కినేని అఖిల్‌ హీరోగా నటించిన తొలి సినిమా 'అఖిల్‌'తో తెలుగు తెరకు పరిచయమైన సయేషా సెహగల్‌కి, టాలీవుడ్‌లో తొలి సినిమా ఏమాత్రం కలిసిరాలేదు. అఫ్‌కోర్స్‌, హీరో అఖిల్‌కి కూడా ఈ సినిమా పెద్ద షాక్‌ ఇచ్చిందనుకోండి.. అది వేరే విషయం. 'అఖిల్‌' ఇచ్చిన దెబ్బతో, అక్కినేని అఖిల్‌ గ్రాండ్‌ రీ-లాంఛ్‌ ప్లాన్‌ చేసుకోవాల్సి వచ్చింది నాగార్జునకి. 

ఇక, సయేషాకి బాలీవుడ్‌లోనూ తొలి సినిమా కలిసిరాలేదు. అదే 'శివమ్‌'. బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఈ సినిమాపైన. సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అజయ్‌ దేవగన్‌ సంగతేమోగానీ, ఈ సినిమాలో నటించిన సయేషా అయితే, బాలీవుడ్‌లోనూ తనకు తొలి సినిమాతో చుక్కెదురవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో తనకు అవకాశాలు వస్తాయా.? అని బాగా డీలాపడిపోయిందట సయేషా. 

ఇంతలోనే సయేషాని వెతుక్కుంటూ ఓ ఆఫర్‌ వచ్చింది. అదే, సంజయ్‌దత్‌ హీరోగా నటిస్తోన్న 'భూమి' అనే సినిమాలో ఛాన్స్‌. సంజయ్‌దత్‌ కుమార్తెగా ఈ సినిమాలో సయేషా నటించనుంది. ప్రస్తుతానికైతే ఈ పాత్రకు సంబంధించిన డిటెయిల్స్‌ బయటకు రాలేదు. ఏదో ఒక ఛాన్స్‌, వచ్చిందే గోల్డెన్‌ ఛాన్స్‌.. అంటూ సయేషా మురిసిపోతోందట.

Show comments