జూన్‌లో జీవీఎంసీ ఎన్నికలు..?

ఎమ్మెల్సీ ఊపును కొనసాగించే యత్నం

విశాఖలో మహానాడుకు యోచన

మేయర్‌ పీఠాన్ని గెలిచేందుకు పక్కా ప్లాన్‌

వేడి బాగా ఉన్నపుడే ఎంతటి ఇనుమైనా ఇట్టే విరిగిపోతుంది, అలాగే, గెలుపు మనవైపు ఉన్నపుడే జాగ్రత్త పడితే అనుకూల ఫలితాలు లభిస్తాయి. రాజకీయ పార్టీలు ఇటు వంటి అంచనాలు వేయడంలో ఎపుడూ ముందుంటాయి. తాజాగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో దక్కిన విజయాన్ని పునరావృత్తం చేయాలని అధికార తెలుగుదేశం పార్టీ గట్టిగా ఆశిస్తోంది. ఇందుకు తగిన పూర్వరంగాన్ని సిద్ధం చేసుకుంటోంది. జీవీఎంసీ ఎన్నికలకు ఇదే ఊపులో వెళ్లడంద్వారా మేయర్‌ పీఠాన్ని అధిరోహించాలని భావిస్తోంది. తాజాగా జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం మద్దతు ఇచ్చిన బీజేపీ అభ్యర్థి మాధవ్‌ మంచి విజయాన్ని నమోదు చేశారు. ఈ ఎన్నికల ఫలి తం తెలుగుదేశం నాయకులకు ఎంతో ఊరటను ఇచ్చిందనే చెప్పాలి. ఉత్తరాంధ్రకు గత మూడేళ్లుగా ఆశించిన విధంగా అభివృద్ధి సాగకపోవడం, ప్రధానంగా రైల్వే జోన్‌ అంశంపై ఎటూ తేల్చకపోవడం వంటి కారణాలతో వ్యతిరేకత జనంలో బాగా ఉంటుందని ఇన్నాళ్లూ టీడీపీ తమ్ము ళ్లు అనుమానిస్తూ వచ్చారు. కేవలం దీని వల్లనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో నేరుగా పోటీ చేయకుండా మిత్రపక్షం బీజేపీకి ఆ సీటును ఇచ్చి జనం నాడిని వెనుక ఉండి గమనించారు.

అయితే, తెలుగుదేశం నాయకులు భయపడినంతగా జనంలో వ్యతిరేకత లేదన్నది బీజేపీ విజయం రుజువు చేసింది. రైల్వే జోన్‌ ఇవ్వకపోయినా, ప్రత్యేక హోదాను పక్కన పెట్టినా కూడా ఓటర్లు టీడీపీ, బీజేపీ మిత్రపక్ష అభ్యర్ధికి అనుకూలంగా ఓటేయడంతో ఇపుడు ఆ రెండు పార్టీల శిబిరాలు యమ ఖుషీగా ఉన్నాయి. ఇంతవరకూ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చెప్పుకుంటూ చేయాల్సిన వాటిని బాగా వివరించగలిగితే జీవీఎంసీ ఎన్నికలలో విజయం నల్లేరు మీద నడకే అవుతుందని కూడా టీడీపీ స్థానిక నాయకత్వం గట్టిగా నమ్ముతోంది. పైగా, ప్రతిపక్షాలు సైతం గతంలో ఎన్నడూ లేనంతగా బలహీనంగా ఉండడం కూడా మిత్ర పక్షాలకు కలసివస్తోంది. జీవీఎంసీ వరకూ చూసుకుంటే ఎన్నికలు జరగకుండానే ఎక్స్‌ అఫీషియో సభ్యుల రూపంలో పదమూడు మంది వరకూ టీడీపీ, బీజేపీ కూటమికి అపుడే బలం వచ్చేసింది. జీవీఎంసీ పరిథిలోని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఈ రెండు పార్టీలకూ ఉన్నారు. ఇక, వైసీపీ విషయానికి వస్తే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒక్కరే ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఉంటారు, కాంగ్రెస్‌ తరఫున టి.సుబ్బరామిరెడ్డి సైతం ఒక్కరే ఉంటారు. అంటే జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించకుండానే మ్యాజిక్‌ ఫిగర్‌కు అవసరమైన సంఖ్యలో మూడవ వంతు మిత్రపక్షం సంపాదిం చేసిందన్నమాట.

ఈ ధీమాతోనే ఇపుడు మేయర్‌ పీఠం మాదే అంటూ టీడీపీ, బీజేపీ ఎన్నికలకు సై అంటున్నా యి. నిజానికి ఈ ఎన్నికలు 2012లో నిర్వహిస్తే ఇప్పటికి ఓ అయిదేళ్ల పదవీ కాలం కూడా పూర్తయ్యేది. కానీ ఓటమి భయంతోనే ఎప్పటికపుడు వాయిదాలు వేసు కుంటూ పోయారు. బాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతున్న వేళ విశాఖ జనం నాడి తమకు అనుకూలిస్తుందని ఇప్పటికి ధైర్యం వచ్చిన మీదట ఎన్నికలకు వెళ్లేందుకు టీడీపీ అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికలు ఏకపక్షంగా గెలవాలని అపుడే టీడీపీ అధినాయ కత్వం స్థానిక నాయకులకు ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికలకు సంబంధించి ఇంతకాలం కోర్టు కేసుల గురించి చెబుతూ వచ్చిన మంత్రులు, పెద్దలు ఇపుడు అది పెద్ద అవరోధం కాదని చెప్పడం గమనార్హం. అనకాపల్లి, భీమిలీ మునిసిపాలిటీలను కలుపుతూ మొత్తం 83 వార్డు లకు ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. కోర్టులో కేసులున్న వారితో మాట్లాడి, కేసులు ఉపసంహరించుకుంటే జీవీఎంసీ కో-ఆప్షన్‌ పదవిని ఇచ్చి రాజీ చేసుకోవాలని కూడా టీడీపీ పెద్దలు భావిస్తున్నారు. అది కనుక వీలు పడకపోతే గతంలో మాదిరిగానే 72 వార్డులకే ఎన్నికలు నిర్వహించాలని కూడా యోచి స్తున్నారు. ఎట్టి పరిస్థితులలోనూ ఎన్నికలు నిర్వహించాలని, వాయిదా వేయకూడదన్న పట్టుదలతో టీడీపీ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, జీవీఎంసీ ఎన్నికలలో గెలిచేందుకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు భారీ ఎత్తున నిధులను కూడా విడుదల చేస్తున్నారు. మొత్తం ఎనిమిది నియోజకవర్గాలకు గానూ యాభై కోట్ల వరకూ నిధులను కేటాయించారు. ఇందులో మంత్రి గంటా నియోజకవర్గమైన భీమిలీకి పదికోట్లు, అనకాపల్లికి తొమ్మిది కోట్లు కేటాయించారు. ఈ రెండూ ఇపుడు జీవీఎంసీలో విలీనం అవుతున్నందువల్ల అక్కడ మరింతగా నిధులను ఖర్చు చేసి అభివృద్ధి చూపించాలన్న ఉద్దేశ్యం కనిపిస్తోంది. ఈ నిధులతో రహదారులు, ఉద్యా నవనాలు, సామాజిక భవనాల నిర్మాణానికి పెద్ద పీట వేస్తారని తెలుస్తోంది. ఇక, ప్రతీ ఏటా తెలుగుదేశం పార్టీ నిర్వహించే వార్షిక సమావేశం మహానాడును ఈసారి విశాఖపట్నంలో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ ఆలో చిస్తోంది. మూడు రోజుల మహనాడు నిర్వహణ ద్వారా విశాఖపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టే అవకాశం ఉంటుందని, కేడర్‌లో కూడా ఉత్సాహం నింపేందుకు ఆస్కారం ఉం టుందని భావిస్తున్నారు. ఇంకోవైపు బీజేపీ కూడా విశా ఖపై ప్రత్యేక దృష్టిని పెడుతోంది. మాధవ్‌ ఎమ్మెల్సీగా నెగ్గిన తరువాత నగరంలో తమ ఓటు బ్యాంకును మరింతగా పెంచుకునేందుకు, మరింతమందిని పార్టీలోకి ఆకర్షించేందుకు కూడా కమలనాధులు కసరత్తు చేస్తున్నా రు. యూపీ ఎన్నికల విజయం, మోడీ పట్ల జనంలో ఉన్న ఆదరణను సొమ్ము చేసుకోవడం ద్వారా వీలైనంతవరకూ ఎక్కువమంది కార్పొరేటర్లను గెలిపించుకోవాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది.

ఇక, ప్రతిపక్షాల విషయానికి వస్తే వైసీపీకి నగర స్ధాయిలో సరైన నాయకత్వం లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. నోరున్న, పేరున్న నాయకులు ఎవరూ ఇపుడు వైసీపీలో లేరు, మూడేళ్ల క్రితం పరాజయం పాలైన తరువాత ఉత్తరాంధ్రలో, మరీ ముఖ్యంగా విశాఖలో పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఈ నేపధ్యంలో జీవీఎంసీ ఎన్నికలను ఎదుర్కోవడం ఆ పార్టీకి కత్తి మీద సాముగానే ఉంటుందన్నది వాస్తవం. వామపక్షాలు, కాంగ్రెస్‌ గతంలో మాదిరిగానే నామమాత్రపు పాత్రనే ఈసారి కూడా పోషిం చే అవకాశాలు ఉన్నాయి. దీంతో, జీవీఎంసీ ఎన్నికలు సాధ్యమైనంత తొందరగా నిర్వహించి ఏపీలో అతి పెద్ద నగరంపై టీడీపీ జెండాను ఎగురవేయడానికి పసుపు శిబిరం తహతహలాడుతోంది.

-పివిఎస్‌ఎస్‌ ప్రసాద్‌

Show comments