తమ్ముడు మారాడన్నయ్యా.!

''పవన్‌కళ్యాణ్‌ చిన్నప్పుడు ఎలా వున్నాడో.. ఇప్పుడూ అలాగే వున్నాడు. వాడిలో ఏ మార్పూ రాలేదు. ఇంట్లో మేమందరం ఒక చోట వుంటే, వాడొక్కడూ ఇంకో చోట వుండేవాడు. వాడి లోకం వేరు. ఏవేవో పుస్తకాలు చదివేవాడు, ఇంకోటేదో చేసేవాడు. చిన్నప్పటినుంచీ వాడిని మేం చూస్తూనే వున్నాం, మాకేమీ కొత్తగా అన్పించలేదు. మేమెప్పుడూ విడిపోలేదు, విడిపోయే ఛాన్సే లేదు. పవన్‌లో మార్పు వచ్చిందని మీరెలా చెప్తారు.?'' అంటూ మెగాస్టార్‌ చిరంజీవి, తన సోదరుడు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ని వెనకేసుకొచ్చేశారు.. కాదు కాదు, వెనకేసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలూ చేశారు. 

కానీ, చిరంజీవికి తెలియాల్సిన విషయం ఇంకోటుంది. అదే, పవన్‌కళ్యాణ్‌ మారాడని. అవును, పవన్‌కళ్యాణ్‌లో చాలా మార్పులొచ్చాయి. తన సినిమా ప్రమోషన్‌లో పవన్‌ ఎక్కడా కన్పించేవాడు కాదు ఒకప్పుడు. కానీ, ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ తన సినిమాల్ని బాగానే ప్రమోట్‌ చేసుకుంటున్నాడు. మీడియా ముందుకొస్తున్నాడు కూడా. ఇంతేనా, ఇంకా చాలా చాలా మారాడు పవన్‌. 

నితిన్‌ని తన సొంత తమ్ముడిలాంటోడని అన్నాడు. అలాగే సప్తగిరి సినిమాని ప్రమోట్‌ చేయడానికీ వచ్చాడు. ప్రమోట్‌ చేయడమంటే, ఆ సినిమా గురించి గొప్పగా చెప్పడమో, సినిమాకి పబ్లిసిటీ చేయడమో కాకపోవచ్చు.. పవన్‌కళ్యాణ్‌ ప్రెజెన్స్‌ తన సినిమాకి ఎంత ప్లస్‌ అవుతుందో సప్తగిరికి తెలుసు.. అలా సప్తగిరి, పవన్‌ రాకతో ఉప్పొంగిపోయాడు. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' ఆడియో ఫంక్షన్‌లో పవన్‌ చెప్పిన మాటల్ని ఎడా పెడా తన సినిమా పబ్లిసిటీకి వాడేసుకున్నాడు సప్తగిరి. 

సప్తగిరి సినిమాకి ఉపయోగపడిన పవన్‌కళ్యాణ్‌, నితిన్‌ సినిమాలకి సెంటిమెంట్‌గా మారిన పవన్‌కళ్యాణ్‌, తొమ్మిదేళ్ళ విరామం తర్వాత తన అన్నయ్య చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ఎందుకు హాజరు కాలేకపోయాడట.? రాలేనప్పుడు, జస్ట్‌ ఓ వీడియో బైట్‌, 'అన్నయ్యా వెల్‌కమ్‌..' అని కూడా పవన్‌ చెప్పలేకపోవడమేంటట.? అఫ్‌కోర్స్‌, ఇది చిరంజీవికి తెలియని విషయం కాదు. కానీ, తమ్ముడ్ని సమర్థించుకోక తప్పదు కదా.! చిరంజీవి సమర్థించుకున్నాసరే, పవన్‌ మారాడు.. అది అన్నయ్యతో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ పెంచుకునేంతలా.!

Show comments