జగపతిబాబు విభిన్న నటుడు. అలాగే వ్యక్తిగా కూడా భిన్నంగానే వుంటాడు. మనసులో ఏదీ దాచుకోడు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాడు. ఇప్పుడు ఓ కార్యక్రమంలో కూడా ఇలాగే స్వంత విషయాలు చాలా చెప్పాడు. తనను సినిమాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని తల్లి కోరిందట. అలా మాట విననందుకు రెండేళ్లు మాట్లాడడం మానేసిందట.
అంతే కాదు, సిగరెట్ కాల్చాడని ఓసారి రెండేళ్లు, అమ్మాయితో వెళ్తూ కనిపించాడని మరోసారి రెండేళ్లు కూడా జగపతి బాబుతో తల్లి మాట్లాడలేదట. ఎప్పుడూ సినిమాల్లోకి రావాలని అనుకోలేదని, ఉన్నట్లుండి ఓ రోజు పురుగు దొలిచేసి, డిసైడ్ అయిపోయి, ఎనిమిది నెలలు కిందా మీదా పడి సినిమాల్లోకి వచ్చేసా అన్నాడు జగపతి.
తనకు సౌందర్యకు ముడిపెడుతూ చాలా కథలు అల్లేసారని, అవేం నిజం కాదని, కానీ సౌందర్య, ఆమె సోదరుడు తనకు మంచి మిత్రులు, అంతకు మించిన సన్నిహితులు అని వెల్లడించాడు. సౌందర్య సహజంగా ఎవర్నీ దగ్గరగా రానిచ్చేది కాదని, తను మాత్రం ఆ కుటుంబానికి చాలా దగ్గరయ్యానని, సౌందర్య గుణగణాలే అందుకు కారణం అని చెప్పుకొచ్చాడు. త్రిష అంటే క్రష్ వుండేదని, ఓ సినిమా కూడా చేయాలని అనుకున్నా కుదరలేదని, ఆ తరువాత వదిలేసానని చెప్పేసాడు. సౌందర్య ముద్దుగా హోమ్లీగా వుంటుందని, ప్రియమణి హాట్ గా వుంటుందనీ చమత్కరించాడు.
సినిమా రంగంలో తనకు యాక్షన్ కింగ్ అర్జున్ అత్యంత మంచి సన్నిహితుడు, ప్రాణ స్నేహితుడు అని ఆ తరువాత తారక్ కూడా మంచి స్నేహితుడన్నారు. మహేష్ సాఫ్ట్ గా కనిపిస్తాడు కానీ, అందరి మీదా భలే సెటైర్లు వేస్తాడని వెల్లడించారు. లెజెండ్ ముందు మూడేళ్ల పాటు సినిమాలు లేక ఖాళీగా వుండిపోయానని, ఏం తొచక స్టిక్ పట్టుకుని, అలా రోడ్ల మీద తిరిగిన సందర్భాలు కూడా వున్నాయని జగపతిబాబు మొహమాటం లేకుండా చెప్పేసాడు