అరవ సినిమా అదుర్స్‌.. టాలీవుడ్‌ బెదుర్స్‌.!

డబ్బింగ్‌ సినిమాలన్నీ సంచలన విజయాలు సాధించెయ్యట్లేదు.. అప్పుడప్పుడూ బారీ అంచనాలతో వచ్చిన అరవ సినిమాలూ అడ్రస్‌ గల్లంతవుతున్నాయి. తెలుగు సినిమా సంగతి సరే సరి. భారీ విజయాలు అప్పుడప్పుడూ నమోదవుతున్నా, ఓవరాల్‌గా 'స్ట్రైక్‌ రేట్‌' మాత్రం చాలా దారుణంగా వుంటోందన్నది నిష్టురసత్యం. 

రీ-ఎంట్రీతో చిరంజీవి కూడా లీగ్‌లో చేరిపోయారు. ఆ లెక్కన నలుగురు అగ్రహీరోలు ఫుల్‌ యాక్టివ్‌గా వున్నారు. ఆ తరాత పవన్‌, మహేష్‌.. లాంటోళ్ళు, చరణ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, ప్రభాస్‌.. ఇలా లెక్కలేనంతమంది హీరోలు టాలీవుడ్‌ సొంతం. ఒకరా, ఇద్దరా.? సరిగ్గా ప్లాన్‌ చేసుకుంటే, ప్రతి వారం థియేటర్లు దొరక్క హీరోలు, నిర్మాతలు, దర్శకులు కిందా మీదా పడాల్సి వస్తుంది. కానీ, ఇప్పుడు కావాల్సినంత గ్యాప్‌ దొరికేస్తోంది. 

తెలుగు సినిమాకి సంక్రాంతి తర్వాత అంత పెద్ద పండగ విజయదశమి. కానీ, ఏమయ్యింది.? విజయదశమికి రావాల్సిన సినిమాలు రాలేదు. దీపావళిదీ సేమ్‌ టు సేమ్‌. ఈలోగా చిన్న సినిమాలు కొస్తంత పండగ చేసుకున్నమాట వాస్తవం. కానీ, పండక్కి పెద్ద సినిమా వస్తే, బాక్సాఫీస్‌ కళ ఇంకోలా వుంటుంది. తద్వారా తెలుగు సినిమా కాసుల గలగలలతో సందడి చేస్తుంది. కానీ, చెయ్యలేదిక్కడ. 

ఇంకో రెండు నెలల్లో సంక్రాంతి, ఆ తర్వాత సమ్మర్‌, మధ్యలో ఓ చిన్న సీజన్‌.. దాదాపు అన్ని పెద్ద సినిమాలూ ఈ మొత్తం సీజన్‌ మీదనే ఫోకస్‌ పెట్టాయి. డిసెంబర్‌లో 'ధృవ' విడుదలవుతుందనుకోండి.. అది వేరే విషయం. అయినాసరే, ప్లానింగ్‌ వైఫల్యం కారణంగా ఒక్కోసారి తెలుగు సినిమా భవిష్యత్‌ ఏమవుతుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంటోంది. తెలుగు సినిమా వెలవెలబోతోంటే, అరవ సినిమా మాత్రం పండగ చేసేసుకుంటోంది.  Readmore!

కార్తీ 'కాష్మోరా' దీపావళికి వచ్చేసింది. సినిమా ఎలా వుంది.? అనే విషయం పక్కన పెడితే, పండగ సినిమాల్లేని లోటుని ఆ సినిమా కాస్త తీర్చిందనే చెప్పాలి. త్వరలో 'సింగం' రీలీజ్‌ అవుతుంది. ఆ సినిమాపైనా భారీ అంచనాలే వున్నాయి. ఏ సినిమాలూ లేక, అరవ సినిమాల్ని తెచ్చుకుని, వాటికి బీభత్సమైన పబ్లిసిటీ చేసుకుని, డబ్బింగ్‌ నిర్మాతలు కాస్త హడావిడి చేస్తున్నారు. ఆ కోవలోనే 'బిచ్చగాడు' పెద్దమొత్తంలో వసూళ్ళను రాబట్టిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? 

తమిళ సినిమా కావొచ్చు, ఇంకో సినిమా కావొచ్చు.. డబ్బింగ్‌ డబ్బింగే. ఆ సినిమాలు రావొద్దని కాదు, కానీ మన సినిమాలకు ప్లానింగ్‌ అంటూ వుండాలి కదా.! ఓ హీరో ప్లానింగ్‌ మిస్సయితే ఓకే, హీరోలంతా ప్లానింగ్‌ లేకుండా బొక్క బోర్లా పడితే, తెలుగు సినిమా భవిష్యత్‌ ఏం కావాలట.? సంక్రాంతికి ఇద్దరు హీరోలు (చిరంజీవి, బాలకృష్ణ) పోటీ పడ్తారో, అంతకన్నా ఎక్కువమందే పోటీ పడ్తారో.. వెరసి, ఆ సీజన్‌ని గందరగోళం చేసి పారేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Show comments