పెద్ద హీరోలు తమ సినిమాల విషయంలో దాదాపు అన్ని నిర్ణయాలను తామే ప్రభావితం చేస్తారు. అది కామన్. అయితే కొంత మంది హీరోలు స్క్రిప్ట్ లో వేళ్లు పెడతారు. మరి కొంత మంది హీరోలకు సినిమా మేకింగ్ మీద మరీ అభిరుచి ఎక్కువై చేతులు పెడతారు. ఇంకొంత మంది చేతులు , కాళ్లేం ఖర్మ టోటల్ గా దూరిపొతారు.
అయితే హీరో పవన్ కళ్యాణ్ ఈ మూడో కోవకు చెందుతారని టాలీవుడ్ లో వుండే గుసగుసల సారాంశం. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకైతే పవన్ తనే స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించారు. డైరక్టర్ బాబీ చేతిని తన చేత్తో పట్టకుని డైరక్షన్ చేయించారనీ అంటారు గిట్టనివాళ్లు. సరే, ఆ సంగతి అలా వుంచితే లేటెస్ట్ మొూవీ కాటమరాయుడు కూడా ఇదే తరహా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. డైరక్టర్ డాలీని అందుకే ఏరి కోరి ఎంచుకున్నాడంటున్నారు. కానీ యూనిట్ వర్గాల బోగట్టా మాత్రం, పవన్ ఈసారి డైరక్షన్ లో వేలు పెట్టలేదని, తమిళ సినిమాను తెలుగులోకి మార్పులు చేర్పులు చేయడం వరకు మాత్రమే సలహాలు, సూచనలు ఇచ్చారని అంటున్నారు.
అయితే లాక్ అయిన కాటమరాయుడు ఫస్ట్ హాఫ్ ను యూనిట్ లో కీలకమైన వాళ్లు కొందరు ఇటీవల చూసుకున్నారని, అది చూస్తే మాత్రం పవన్ హ్యాండ్ బాగానే దూరినట్లు క్లియర్ గా తెలుస్తోందని గ్యాసిప్ లు వ్యాపించడం ప్రారంభమైంది. ఇంతకీ ఏది నిజం? పవన్ డాలీలోకి దూరినట్లా? లేదా? సినిమా వస్తే తెలిసిపోతుంది.