నిన్న దాదాపు మూడు నాలుగు గంటల పైనే చర్చ.. నేడు అటూ ఇటూగా రెండు గంటల పాటు చర్చ.. వెరసి, ఐదారు గంటల పాటు చర్చ జరిగింది. కేవలం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశం మీదనే చర్చ జరిగింది. దేశమంతా ఒక వైపు, భారతీయ జనతా పార్టీ ఒక్కటీ ఒక వైపు. అయితేనేం, దేశం ఓడిపోయింది.. భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది.
ప్రత్యేక హోదా విషయమై రాజ్యసభ సాక్షిగా అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ ఏమయ్యింది.? అది ప్రధాని ఇచ్చిన హామీ కాదు, సభ ఇచ్చిన హామీ. ఆ హామీకి విలువ వుందా.? లేదా.? చట్ట సభల్ని మీరు ఏ మేరకు గౌరవిస్తున్నారు.? ప్రత్యేక హోదా ఇస్తారా.? ఇవ్వరా.? ఈ ప్రశ్నలు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి బీజేపీ వైపుకు దూసుకొచ్చాయి. పశ్చిమబెంగాల్, తమిళనాడు, తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా.. వీటితోపాటే ఆంధ్రప్రదేశ్, మరికొన్ని దేశాలు ప్రశ్నించాయి.
ఎవరేమనుకున్నా డోన్ట్ కేర్. నిద్రపోతున్నోడ్ని మేల్కొలపడం తేలిక. కానీ, నిద్రపోతున్నట్లు నటిస్తున్నవాడిని ఎలా మేల్కొలపగలం.? అదే జరిగింది రాజ్యసభలో. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగ సభలో ఏం చెప్పారో, సభాధ్యక్షుడి హోదాలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభ సాక్షిగా అదే చెప్పారు. అంతకు మించి, ప్రత్యేక హోదా గురించి మాత్రం ఆయన పెదవి విప్పలేదు.
పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది, వాకౌట్ చేసేసింది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే పారిపోయింది. టీడీపీ సంగతి సరే సరి.. అక్కడికే బీజేపీ కనుసైగలతో హెచ్చరించేసరికి 'కుక్కిన పేనులా' సైలెంటయ్యింది. వామపక్ష నేత సీతారాం ఏచూరి, ఇంకొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన సభ్యులు, రాజ్యసభ ఇచ్చిన హామీకి విలువ వుందా.? లేదా.? దేశానికి మీరు ఏం చెప్పదలచుకుంటున్నారు.? అని ప్రశ్నించారు. అరుణ్ జైట్లీ నుంచి సమాధానం లేదు.
ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు.. అని చెప్పలేదు సరికదా, 'కథ ఇంకా వుంది..' అన్న సంకేతాల్ని పంపారు అరుణ్ జైట్లీ. మొత్తంగా చూస్తే, ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు. దేశమంతా ఒక్కటైనా, బీజేపీ నుంచి సమాధానం రాబట్టలేకపోయింది. ఇదంతా తమ గొప్పతనమే అని బీజేపీ అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటుండదు. ఇంతకన్నా 'బలుపు' ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేమయ్యింది.? రేప్పొద్దున్న బీజేపీ పరిస్థితి కూడా అంతే.