తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతుల నెత్తిన పాలు పోశారాయన. అవును, ఈ విషయంలో రాజకీయ విమర్శలకు తావు లేదు. ఎందుకంటే, ఇది రైతులకు సంబంధించిన విషయం. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామంటూ సంచలన ప్రకటన చేశారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలు వుండవనీ, రైతుల కోసం ఏమేం చెయ్యాలో అన్నీ చేస్తామనీ, ఇప్పటికే రుణమాఫీ చేశామనీ కేసీఆర్, రైతు సంఘాల నేతలతో హైద్రాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయం 'ప్రగతి భవన్'లో జరిగిన సమావేశంలో చెప్పుకొచ్చారు.
రిజర్వేషన్ల అంశంపై కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతిస్తే, బీజేపీ - టీడీపీ వ్యతిరేకించాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ చాలా నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పటిదాకా. వాటిల్లో చాలావరకు విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నవే. కానీ, రైతుల విషయంలో ఇప్పుడిక ఎవరూ విమర్శలు చేయడానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే, రైతుల కోసం ఏ ప్రభుత్వం మేలు చేసినా సరే, స్వాగతించి తీరాల్సిందే.
మొత్తమ్మీద, 2019 ఎన్నికల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారన్నమాట. మొత్తం 55 లక్షల మంది రైతులకు మేలు చేసేలా 'ఉచిత ఎరువుల పథకాన్ని' కేసీఆర్ ప్రకటించడమంటే ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. దీని వెనుక ప్రభుత్వంపై చాలా ఆర్థిక భారం పడే అవకాశం వున్నప్పటికీ, 'ధనిక రాష్ట్రం'లో పేద రైతుల ఆత్మహత్యలుండకూడదన్న కోణంలోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నది టీఆర్‌ఎస్ శ్రేణుల వాదన. అన్నట్టు, ఎరువుల్ని ఉచితంగా అందిస్తాంగానీ, పురుగుల మందులు మీరే కొనుక్కోండంటూ కేసీఆర్ ఛమక్కులు వేశారు.
పొరుగు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్‌లో రుణమాఫీ కోసం పిల్లి మొగ్గలేసేస్తోంది అక్కడి చంద్రబాబు సర్కార్. ఇప్పుడు తెలంగాణలో ఉచిత ఎరువుల పథకానికి ధీటుగా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్ అలాంటి ఇంకేదన్నా సాహసం చేస్తుందా.? చెయ్యగలదా.? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందాన, కేసీఆర్‌ని చూసి చంద్రబాబు సరికొత్త పథకాలు ప్రకటించడం మామూలే కదా.!