కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్స్ చేసుకుంటూ పోతే, నెంబర్ వన్ పొజిషన్ చాలా తేలిగ్గా దక్కేస్తుందని చాలామంది యంగ్ హీరోలు భావిస్తుంటారు. ఒకప్పుడు యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌ది కూడా ఇదే ఆలోచన. ఒకదాన్ని మించిన సక్సెస్ ఇంకోటి అందడంతో, నెంబర్ వన్ ఛెయిర్ వైపు ఎన్టీఆర్ అడుగులు చాలా వేగంగా పడ్డాయి. కానీ, అక్కడే తేడా కొట్టేసింది. మూస ధోరణిలో సినిమాలు చేసుకుంటూ పోవడంతో, ఫ్లాప్ మీద ఫ్లాప్ ఎదురయ్యింది.
'నేను ఆశించే సక్సెస్ నాకు దక్కడానికి చాలా టైమ్ పట్టింది.. ఎదురుచూశాను, చూశాను.. ఇప్పుడు ఓ మోస్తరుగా నా ఆశలు తీర్చేందుకు హిట్ దొరికింది..' అంటూ 'టెంపర్' సినిమా తర్వాత ఉద్వేగంగా వ్యాఖ్యానించాడు ఎన్టీఆర్. 'నాన్నకు ప్రేమతో' సినిమా టైమ్‌లోనూ ఇలాగే ఎమోషనల్ అయ్యాడు, తాను ఇంకో మెట్టు పైకెక్కానని. 'జనతా గ్యారేజ్' సినిమా టైమ్‌లో ఇంకా హ్యాపీగా ఊపిరి పీల్చుకున్నాడు ఎన్టీఆర్.
తిరుగులేని స్టార్‌డమ్ వున్నా, ఎన్టీఆర్ ఆ మూడు సినిమాల్నే ప్రత్యేకంగా ఎందుకు మెన్షన్ చేసినట్టు.? దానికి సమాధానమే, 'జై లవ కుశ' సినిమా. ఇందులో మూడు పాత్రలు, అందులో ఒకటి నేడు బయటకొచ్చింది. ఇదొక్కటి చాలు, ఎన్టీఆర్ తనను తాను మార్చుకునేందుకు ఎంత కష్టపడ్డాడో చెప్పడానికి. 'జై' టీజర్‌లో ఎన్టీఆర్ పరంగా వంక పెట్టడానికేమీ లేదు. జస్ట్ అల్టిమేట్ ఎన్టీఆర్ అంతే. మిగతా రెండు పాత్రలు, 'లవ, కుశ' త్వరలో వెల్లడి కాబోతున్నాయి.
ఆల్రెడీ ఎన్టీఆర్‌ని పరిపూర్ణమైన నటుడని అనేస్తున్నాం. త్వరలో రాబోయే రెండు పాత్రలతో, 'అంతకుమించి' అని ఎన్టీఆర్ అన్పించుకోవడం ఖాయం. ఓ సినిమా హిట్టయితే ఆ బాటలో మరో సక్సెస్‌ని వెతుక్కోవడం మామూలే. కానీ, ఓవర్ ది టాప్ అనేలా ఎన్టీఆర్ సినిమాల్ని ఎంచుకుంటుండడాన్ని ఖచ్చితంగా అభినందించి తీరాలి.