భూమన అరెస్ట్‌కి రంగం సిద్ధం.!

కాపు సామాజిక వర్గం రిజర్వేషన్ల కోసం చేపట్టిన 'కాపు ఐక్య గర్జన' సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తునిలో చోటు చేసుకున్న విధ్వంసాలపై నమోదైన కేసులకు సంబంధించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి సహా పలువురికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ రోజు భూమన, గుంటూరు జిల్లాలో ఏపీ సీఐడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. 

కాపు సామాజిక వర్గం చేపట్టిన ఉద్యమం, తదనంతరం చోటు చేసుకున్న విధ్వంసానికీ, భూమన కరుణాకర్‌రెడ్డికీ అసలు సంబంధమేంటి.? అంటే, అది విచారణలో తేలాల్సిన అంశం. అధికార పార్టీ అందిస్తున్న లీకుల ప్రకారం, తుని విధ్వంసానికి ముందు భూమన కరుణాకర్‌రెడ్డి, తన అనుచరుల్ని, కొందరు విధ్వంసకారుల్ని తునిలో మోహరించారట. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు టీడీపీ దగ్గర వున్నాయట. అదీ అసలు విషయం. 

కాపు ఐక్య గర్జన బహిరంగ సభ నిర్వహించింది కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. జరిగి విధ్వంసాలకు కాస్తో కూస్తో, కాపు ఐక్య గర్జన వేదిక పైనుంచి ముద్రగడ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా కారణమే. రోడ్డుపై బైఠాయించడం, తుని రైల్వే స్టేషన్‌ వైపుకు దూసుకెళ్ళడం.. ఇవన్నీ అప్పటికప్పుడు వేదికపై నుంచి చేసిన ఆవేశపూరిత ప్రసంగాల ఫలితమే. ఈ క్రమంలోనే రైలు దహనం కూడా జరిగింది. 

కానీ, ఇక్కడ ముద్రగడ పద్మనాభంని ప్రభుత్వం 'టచ్‌' చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే, ఇది చాలా సున్నితమైన విషయం. దాంతో, వ్యూహాత్మకంగా ప్రతిపక్షాన్ని అధికార పక్షం టార్గెట్‌ చేసింది. ఆ కోణంలోనే, భూమన కరుణాకర్‌రెడ్డిపై టీడీపీ ముందస్తుగా లీకులు పంపింది.. రాజకీయ ఆరోపణలూ చేసింది. కాపు ఐక్య గర్జనకు వైఎస్సార్సీపీ నేతలు కొందరు మద్దతిచ్చిన మాట వాస్తవం. ఆ మాటకొస్తే, కాంగ్రెస్‌ నేతలూ ఆ గర్జనకు మద్దతిచ్చారు. టీడీపీలోని కొందరు నేతలు కూడా తెరవెనుక సహాయ సహకారాలు అందించారు. 

మరిప్పుడు, కేవలం భూమన కరుణాకర్‌రెడ్డిని తుని విధ్వంసం కేసులో టార్గెట్‌ చేయడం ఏంటట.? అందరికీ తెల్సిన విషయమే భూమన, వైఎస్‌ జగన్‌కి అత్యంత సన్నిహితుడు. జగన్‌ని మానసికంగా దెబ్బతీసేందుకు భూమన చుట్టూ టీడీపీ 'ఉచ్చు బిగించినట్లు' తెలుస్తోంది. ఇక, విచారణకు పిలవడం, కొన్ని సందర్భాల్లో అరెస్ట్‌ చేయడం మామూలే. భూమన అరెస్ట్‌ తప్పదంటూ ఊహాగానాలు విన్పిస్తున్న వేళ వైఎస్సార్సీపీ శ్రేణులు అలర్ట్‌ అవుతున్నాయి. అదే సమయంలో, పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా సున్నితమైన ప్రాంతాల్లో కుట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా కొందరు వైఎస్సార్సీపీ నేతల ఇళ్ళ వద్ద నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. 

చూస్తోంటే, ఇదంతా భూమన అరెస్ట్‌ కోసమేనా.? అన్న సందేహాలు కలగక మానవు. అయితే, భూమన అరెస్ట్‌ జరగకపోవచ్చనీ, ఇది కేవలం విచారణ వ్యవహారమేననే వాదన కూడా విన్పిస్తోందనుకోండి.. అది వేరే విషయం. చూద్దాం.. ఏం జరుగుతుందో.!

Show comments