మాటల్లో 'పవర్‌' చేతల్లో ఏదీ.?

అమెరికా పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత, ఇండియాకి వెళ్ళిన తర్వాత పవన్‌కళ్యాణ్‌ రాజకీయ కార్యాచరణ ఎలా వుంటుంది.? ఈ ప్రశ్న అమెరికాలోనే పవన్‌కళ్యాణ్‌కి ఎదురయ్యింది. జనసేన పార్టీని బలోపేతం చేస్తారా.? అని మీడియా, పవన్‌కళ్యాణ్‌ని అమెరికాలో ప్రశ్నిస్తే, పార్టీని బలోపేతం చేయడం కన్నా.. పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి.. అని సెలవిచ్చారాయన. 

పవన్‌కళ్యాణ్‌ మాటలు చాలా చిత్రంగా అన్పిస్తుంటాయి. మూడేళ్ళయ్యింది పవన్‌కళ్యాణ్‌, జనసేన పార్టీని స్థాపించి. అప్పటికీ, ఇప్పటికీ పవన్‌కళ్యాణ్‌ తప్ప ఇంకొకరు కన్పించడంలేదు పార్టీలో. అసలంటూ పార్టీ బలోపేతమయితే కదా, పార్టీ భావజాలం అనేది ప్రజల్లోకి వెళ్ళేది. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంటారు, ఉత్తరాది - దక్షిణాది రగడ.. అంటారు. కానీ, ఆ మాటలేవో జనం మధ్యలోకి తన పార్టీ ద్వారా తీసుకెళ్ళరు. 

జనసేనాధిపతిగా పవన్‌కళ్యాణ్‌ ఏం చెబుతున్నారో, అవే మాటలు ఆయన పార్టీకి చెందిన నేతలు కూడా చెప్పాలి. చెప్పడానికి అసలు జనసేన పార్టీకి నేతలంటూ కావాలి కదా.! అభిమానులే ప్రస్తుతానికి పార్టీ కార్యకర్తలు, నేతలు. సినిమా రిలీజయినప్పుడు హడావిడి చేయడం, ఆ తర్వాత సైలెంటయిపోవడం.. అభిమానుల హడావిడి ఇలా వుంటుంది. అందుకే, జనసేన పార్టీకి అధినేత వున్నా లేనట్టే.. ఆ పార్టీ వున్నా లేనట్టే అయిపోతోంది. 

నిజానికి, తనకున్న ఫాలోయింగ్‌ని పొలిటికల్‌గా మార్చుకునేందకు పవన్‌కళ్యాణ్‌కి 'గోల్డెన్‌' ఛాన్స్‌ వుందన్నది నిర్వివాదాంశం. భావజాలాన్నీ జనంలోకి తీసుకెళ్ళలేక, పార్టీనీ జనంలోకి తీసుకెళ్ళలేక, రాజకీయాల్లో పవన్‌కళ్యాణ్‌ జస్ట్‌ 'షో' చేసేసి వచ్చేస్తుండడంతో, ఈ సినిమాటిక్‌ రాజకీయాల్ని జనం సైం విశ్వసించలేని పరిస్థితి. 

మొత్తమ్మీద, పవన్‌కళ్యాణ్‌ తన గందరగోళ రాజకీయాల్ని తెలుగు గడ్డ మీదే కాదు, ఆయన రాక కోసం ఎదురుచూసిన అమెరికాలోని తన అభిమానుల వద్ద కూడా కొనసాగించి, ఇంకాస్త గందరగోళం పెంచారన్నమాట.

Show comments