బంపర్‌ ఆఫర్‌.. ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే.!

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమంటూ నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగారియా సెలవిచ్చారు. ఇదేమీ కొత్త మాట కాదు. పాత మాటే. పాడిందే పాటరా పాచి పళ్ళ డాష్‌ డాష్‌.. అన్న చందాన, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, టీడీపీ నేతలు.. ముఖ్యమంత్రి సహా.. చాలామంది ఇదే మాట చెబుతూనే వున్నారు. 

'ముగిసిన అధ్యాయం..', 'ముగిసిన కథ..' అన్న మాటలు రాజకీయాల్లో చెల్లవుగాక చెల్లవు. నిన్న తప్పు, నేడు ఒప్పు, రేపు మళ్ళీ అదే తప్పు కావొచ్చుగాక. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదం ఒకప్పుడు నిషేధించబడింది.. ఆ తర్వాత అదే నినాదం ఊపందుకుంది.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టింది. అలాంటప్పుడు, ప్రత్యేక హోదా ఎందుకు సాధ్యం కాదు.? 

దేశంలో ఏ రాష్ట్రానికీ 2017 మార్చి తర్వాత ప్రత్యేక హోదా వుండబోదని బీజేపీ నేతలు గతంలో చెఫ్పుకొచ్చారు. టీడీపీ నేతలూ వంతపాడారు. మార్చి వెళ్ళింది, ఏప్రిల్‌ దాటింది, మే కూడా పూర్తయ్యింది.. ఇప్పుడు జూన్‌ వచ్చింది. దేశంలో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు అలాగే వున్నాయి. జమ్మూకాశ్మీర్‌కి వున్న ప్రత్యేక హోదాని తీసేశామని కేంద్రం చెప్పగలదా.? ఛాన్సే లేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌కి మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వదు. ఎందుకంటే, అదంతే. 

ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాం గనుక, ప్రత్యేక హోదా ప్రశ్నే రాదన్నది పనగారియా ఉవాచ. అవునా.? అలాగైతే, జమ్మూకాశ్మీర్‌కి ప్రధాని నరేంద్రమోడీ లక్షన్నర కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. అందులో చాలావరకు జమ్మూకాశ్మీర్‌కి దక్కుతోంది కూడా. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంతవరకు గడచిన మూడేళ్ళలో ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాల్లేవు. సాధారణంగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కేటాయించిన నిధులకు సంబంధించి ఏపీకి వచ్చే వాటాని ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ప్రచారం చేసుకుంటూ వస్తోంది నరేంద్రమోడీ సర్కార్‌. 

ఎందుకిలా.? ఈ బంపర్‌ ఆఫర్‌ ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే ఎందుకట.? ఏమో మరి, ప్రధాని నరేంద్రమోడీకి మాత్రమే తెలియాలి. గట్టిగా నిలదీయాల్సిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు మెదకపోతే, నరేంద్రమోడీ మాత్రం ఎందుకు పట్టించుకుంటారట.?

Show comments