'బాహుబలి' చిత్రం తొలి భాగానికి 'ది బిగినింగ్' అని పేరెందుకు పెట్టారో కానీ, భారతీయ సినీ చరిత్రలో కొత్త శకానికి ఇది నాంది పలికింది. 'బాహుబలి' మొదటి భాగం విజయాన్ని బాలీవుడ్ అంతగా లెక్క చేయలేదు. ఇండియాలో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఆ చిత్రాన్ని బాలీవుడ్ ట్రేడ్ కూడా తెలివిగా విస్మరించింది. కేవలం హిందీ వెర్షన్ సాధించిన వసూళ్లని మాత్రమే హైలైట్ చేసి, దంగల్, పీకే లాంటి చిత్రాలని పైన నిలబెట్టింది.
'బాహుబలి 2' వారికి ఆ అవకాశాన్నివ్వలేదు. హిందీ అనువాదంతోనే బాలీవుడ్ చిత్రాలకి ఇంతవరకు సాధ్యం కాని నాలుగు వందల కోట్లు, అయిదు వందల కోట్ల క్లబ్స్‌ని ఓపెన్ చేసింది. ఇది ఒక రకంగా బాలీవుడ్‌కి మంచిదే అవుతుంది. ఎందుకంటే ఇంతకాలం కంఫర్ట్ జోన్ విడిచి బయటకి రావడానికి బాలీవుడ్ హీరోలు, నిర్మాతలు సాహసించలేదు. ఎప్పటికప్పుడు సేఫ్ సినిమాల మీదే దృష్టి పెట్టారు తప్ప, ఇండియన్ సినిమా పొటెన్షియల్ ఎంతనేది తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు.
'బాహుబలి'తో మన దేశంలోనే ఎంత బిజినెస్ జరుగుతుందనేది తెలిసింది. 'దంగల్' వలన మనం పట్టించుకోని దేశాల్లో మన చిత్రాలకి ఎంత సత్తా వుంటుందనేది తెలిసొచ్చింది. దీంతో ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది. నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి రెండు వందల కోట్లు రాబట్టుకోవడం కంటే, అయిదు వందల కోట్లు ఖర్చు పెట్టి వెయ్యి కోట్లని తెచ్చుకోవడం మంచిదని గ్రహించారు.
ఇకపై బాహుబలి లాంటి సినిమాలు నూటికో, కోటికో కాకుండా కనీసం ఏడాదికి ఒకటైనా వస్తాయని ప్రస్తుతం అగ్ర నిర్మాతలు తీసుకుంటోన్న నిర్ణయాలే తెలియజేస్తున్నాయి. హాలీవుడ్ సినిమాల కోసం మనం ఎగబడినట్టే, ఇకపై మన చిత్రాల కోసం విదేశీయులు ఎగబడే రోజులొస్తున్నాయి.