ప్రజల సమస్యలన్నింటినీ గాలికొదిలి....

ఒక రకంగా చెప్పాలంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరించేశారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉన్నమాట నిజమే కానీ.. ఇప్పటి నుంచి తాను యుద్ధ సన్నాహాల్లోకి దిగుతున్నట్లుగా ఆయన సంకేతాలు ఇచ్చేశారు. అయితే దానికి తగురీతిలో సిద్ధం కావాల్సిన తెలుగుదేశం పార్టీ... ఇంకా భ్రమల ప్రపంచంలోనే మునిగి ఉన్నట్లుగా కనిపిస్తోంది.

కనీసం తాము ప్రజల కోసం పనిచేస్తున్నాం అనే తరహాలో కనిపించడం కూడా వదిలేసి.. రాజకీయ ప్రయోజనాలను మాత్రమే పట్టుకు వేళ్లాడుతున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. తాజాగా జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబునాయుడు తన పార్టీ ఎంపీలకు చేసిన దిశానిర్దేశాన్ని గమనిస్తే వారికి రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల సమస్యలు పట్టే రోజులు గతించిపోయినట్లుగా కనిపిస్తోంది.

ఈ నెల 17వ తేదీనుంచి పార్లమెంటు సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో తన పార్టీ ఎంపీలు ఎలా వ్యవహరించాలనే దానిపై మాట్లాడడానికి చంద్రబాబునాయుడు ఓ మీటింగు పెట్టుకున్నారు. అందులో ప్రజల సమస్యల గురించి ఆయన చెప్పిందేమీ లేదు. కేంద్రం మీద తమ పార్టీ ఎంపీలతో ఒత్తిడి పెంచి ప్రత్యేక హోదా సాధించడం గురించి పోరాడాల్సిన బాధ్యతను తెలుగుదేశం ఏనాడో గాలికి వదిలేసింది.

కనీసం అమరావతి కోర్ కేపిటల్ నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం నుంచి త్వరగా రాబట్టి... నిర్మాణాలను త్వరగా చేపట్టేలా మాట్లాడడం గురించి గానీ... పోలవరానికి అవసరమైన బకాయి నిధులు మొత్తం రాబట్టడం గురించి గానీ.. మొక్కుబడి చర్చలే జరిగాయి. 

ఇంతకూ ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగిన అంశాలేంటంటే.. ప్లీనరీలో జగన్ చేసిన విమర్శల్ని ఎదుర్కోవడం ఎలాగ? జగన్ దాడిని తట్టుకుంటూ మన గురించి మనం జనంలో సొంత డప్పు కొట్టుకోవడం ఎలాగ? అనేవి మాత్రమే. ఎంపీలకు కేంద్రంతో పోరాడాల్సిందిగా చంద్రబాబు ఇచ్చిన సందేశం మొత్తం.. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు గురించి మాత్రమే. దీనివల్ల రాజకీయంగా నాయకులకు ప్రయోజనమే తప్ప.. ప్రజలకు ఒరిగేది శూన్యం.

జగన్ పై కేసుల విషయంలో గట్టిగా చర్యలు తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకోవాలని కూడా చంద్రబాబు ఎంపీలకు సూచించారు. అయినా కోర్టులో ఉన్న సమస్య గురించి ప్రభుత్వం ఏ రకంగా జోక్యం చేసుకుని ఏ రకంగా కఠినంగా వ్యవహరించడం కుదురుతుందో.. అది ఏ రకంగా న్యాయబద్ధమైన ప్రక్రియ అనిపించుకుంటుందో... నలభయ్యేళ్ల రాజకీయ అనుభవజ్ఞుడినని చాటుకునే చంద్రబాబునాయుడుకు స్ఫురించినట్లు లేదు.

ఈ రకంగా చంద్రబాబు.. కేవలం రాజకీయ సంకుచిత, స్వార్థ అంశాలు తప్ప.. ఎలాంటి ప్రజల అంశాలను తన పార్టీ ఎంపీలకు సూచించే స్థితిలో లేకుండా పోయారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Show comments