వామపక్షాలు పవన్‌ వైపు చూస్తున్నాయా?

కేంద్రం ప్రత్యేక హోదాకు మంగళం పాడి 'ప్రత్యేక సాయం' ప్రకటించిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు రెండుగా విడిపోయాయి. ఇప్పుడు కొత్తగా విడిపోవడం కాదనుకోండి. అయినప్పటికీ ప్రత్యేక హోదా విషయం తేలిపోయిన తరువాత రెండు శిబిరాలు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. అధికార పార్టీలైన టీడీపీ, బీజేపీ ఒక శిబిరం కాగా, ప్రతిపక్షాలు మరో శిబిరం. టీడీపీ, బీజేపీ విడిపోతాయా అనుకునేంత పరిస్థితి వచ్చింది. అలాంటి వాతావరణం ఏర్పడింది. కాని ప్రత్యేక సాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించడంతో ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఒక్కటై ఒకే గొంతు వినిపిస్తున్నాయి. 

ప్రత్యేక ప్యాకేజీపై రెండు పార్టీల నాయకులు కలిసి ప్రచారం చేయాలని, కలిసి ప్రజలకు వివరించాలని ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా దివానిర్దేశం చేశారు. ప్రతిపక్షాలన్నీ ప్రత్యేక హోదా ఇవ్వనందుకు మండిపడుతున్నా  ఉమ్మడిగా పోరాటం చేస్తాయా? అనేది అనుమానమే. బీజేపీ, టీడీపీ ఒకే మాట మీద ఉన్నాయి కాబట్టి ఎంత పోరాటం చేసినా ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదు. మరి ప్రజలను ఎవరు కన్విన్స్‌ చేస్తారో, ఎవరు తమ వైపు తిప్పుకుంటారో చూడాలి. ప్యాకేజీ (ప్రత్యేక సాయం) వల్ల మేలు కలుగుతుందనుకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి (అప్పటికీ కలిసుంటాయా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది)  ఓట్లేస్తారు. 

హోదా ఇవ్వకుండా అన్యాయం చేశారని, చంద్రబాబు కేంద్రానికి లొంగిపోయారని భావిస్తే పోరాట యోధుడిగా ముద్రపడిన జగన్‌ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ అప్పుడే వచ్చే ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలని ఆలోచిస్తున్నాయట...! వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధాన ఆయుధం ప్రత్యేక హోదాయే.  అయినప్పటికీ అందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి అధికార పార్టీలను ఎదుర్కొనే అవకాశం లేదు. కాని ఒక కూటమికి అవకాశం ఉన్నట్లు ఓ ఆంగ్ల పత్రిక అంచనా వేస్తోంది. ఏమిటా కూటమి? పవన్‌ కళ్యాణ్‌ జనసేన-వామపక్షాలు. లెఫ్ట్‌ పార్టీలు పవన్‌ వైపు చూస్తున్నాయని రాసింది. 

రెండేళ్ల ముందుగానే ఇలాంటి ఊహాగానాలు చేయడం కరెక్టా?  అనే ప్రశ్న రావొచ్చు. విశ్లేషకులు అంచనాకు రావడానికి ఏవో కొన్ని సంకేతాలు కనబడుతుంటాయి. ఆ అంచనాలు నిజమవడం, కాకపోవడం అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు (సీపీఎం, సీపీఐ) 'తోక పార్టీలు' అనే ముద్ర పడింది. ప్రతి ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలు పొత్తుల కోసం ప్రయత్నాలు చేయడం, కుదిరితే ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోవడం లేదా అవగాహన ఏర్పరచుకోడం చేస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీలు పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో బద్ధశత్రువైన కాంగ్రెసుతో ఎన్నికల పొత్తు పెట్టుకొని కొత్త చరిత్ర రాసుకున్నాయి. 

కొందరు ఇది మరో 'చారిత్రక తప్పిదం' అని కూడా విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో పొత్తులు 'ఎర్ర' పార్టీలకు కొత్త కాదు కాబట్టి, అవి ఏదో ఒక పార్టీ వైపు చూస్తున్నాయనుకోవడం తప్పు కాదు. పవన్‌ కళ్యాణ్‌కు వామపక్షాలంటే అభిమానం , సానుభూతి ఉన్నాయి. ముఖ్యంగా సీపీఎం పైన ఎక్కువ అభిమానం ఉంది. కాకినాడ సభలో ఈ విషయం చెప్పాడాయన. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంది సీపీఎం మాత్రమేనని అన్నాడు పవన్‌. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి నడిచే అవకాశముందని సూచనప్రాయంగా చెప్పాడు కూడా. 

తాను మార్క్సిజం, కమ్యూనిజం అధ్యయనం చేశానని, వామపక్ష నాయకుల చరిత్రలు చదివానని ప్రతి సభలోనూ చెబుతున్నాడు. వామపక్షాలు పవన్‌ వైపు మొగ్గడానికి కారణాలున్నాయి. ఎర్ర పార్టీలకు ఇతర విషయాలు ఎలా ఉన్నా బీజేపీపి గట్టిగా వ్యతిరేకించేవారిని దగ్గరకు తీసుకుంటారు. సైద్ధాంతికంగా, భావజాలపరంగా కొన్ని విభేదాలున్నా పట్టించుకోరు. వారికి ప్రధానంగా కావల్సింది బీజేపీ వ్యతిరేకత. కాకినాడ సభలో దానిపై స్పష్టత వచ్చింది. పవన్‌ డిమాండ్‌, లెఫ్ట్‌ డిమాండ్‌ ఒక్కటే...ప్రత్యేక హోదా. పవన్‌పై అవినీతి ఆరోపణలు, కేసులు లేవు. పైగా ఇమేజ్‌ ఉంది. పవన్‌ వైపు మొగ్గడానికి ఈ కారణాలు సరిపోతాయి. 

జనసేనకు కేడర్‌ ఎలా ఉన్నప్పటికీ వామపక్షాలకు వ్యవస్థ, కేడర్‌ ఉన్నాయి. 2009లో చిరంజీవి వామపక్షాలతో కలవాలనుకున్నాడు. వారూ మొగ్గు చూపారు. కాని అవగాహన రాహిత్యం, ముందు చూపు లేకపోవడంతో ఆ అవకాశం పోయింది. సీపీఎం అగ్రనాయకులు ఢిల్లీ నుంచి వచ్చి చిరంజీవితో మాట్లాడాలనుకుంటే తాను వెళ్లకుండా రాజకీయ నాయకుడు కాని సహచరుడిని పంపాడు. చిరంజీవితో కలవడం వృథా అని భావించి టీడీపీ, టీఆర్‌ఎస్‌తో చేతులు కలిపారు. పొత్తు ప్రతిపాదనే వస్తే పవన్‌ ఎలా వ్యవహరిస్తాడో...!

Show comments