ప్రజాస్వామ్యంలో చాలా 'విలువలకి' పాతరేసేశాం. 'భద్రతా కారణాల రీత్యా..' అనే సాకుతో, 'నేతల ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో' అనే వంకతో.. అసలంటూ 'నాయకులు' ఆందోళనలు చెయ్యలేని దుస్థితి దేశంలో దాపురించింది. ఒకప్పటి పరిస్థితి వేరు. విపక్షంలో వున్నవారు ఆందోళనలు చేస్తే, అధికార పక్షాలు దిగొచ్చేవి. ప్రజల తరఫున విపక్షాలు చేసే పోరాటాలు విజయవంతమయ్యేవి. ఇప్పుడలా కాదు, అసలంటూ విపక్షాలకు పోరాటం చేసే ఛాన్సే అధికారపక్షం ఇవ్వడంలేదు.
పోరాటం.. అంటేనే అధికారంలో వున్నవారికి వెన్నులో వణుకు పుడుతోంది. ఏదో ఒక వంక పెట్టి ఆయా పోరాటాల్ని అడ్డుకోవడం సర్వసాధారణమైపోయింది. మొన్నటికి మొన్న ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్, గుంటూరులో నిరాహార దీక్ష చేస్తే ఏమయ్యింది.? 'అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా..' అంటూ నిరాహార దీక్ష 'టెంట్'ని లేపేసింది అధికారపక్షం. ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తానన్న ప్రతిసారీ, 'భద్రతా కారణాల రీత్యా అనుమతివ్వలేం..' అని ప్రభుత్వం తేల్చి చెబుతోంది.
ఇప్పుడిదంతా ఎందుకంటే, వైఎస్ జగన్ అతి త్వరలో పాదయాత్ర చేయబోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాటలో, ఆంధ్రప్రదేశ్ అంతటా పాదయాత్ర చేయాలన్నది వైఎస్ జగన్ యోచన. కానీ, అధికారపక్షం అందుకు ఛాన్సిస్తుందా.? ఛాన్సే లేదు. చంద్రబాబు, 2014 ఎన్నికలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఆ పాదయాత్ర రాజకీయంగా ఎంతో కొంత ఆయనకు ఉపకరించిందన్నది నిర్వివాదాంశం.
అంతెందుకు, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన నేపథ్యంలో చంద్రబాబు నిరహార దీక్ష చేసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? కానీ, చంద్రబాబు హయాంలో నిరాహార దీక్షలకు ఛాన్స్ లేదు.. పాదయాత్రలకు అసలే అవకాశం లేదు. సో, వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తానన్నా చంద్రబాబు సర్కార్ అనుమతించే అవకాశం వుండకపోవచ్చు. మరెలా.? వైఎస్ జగన్ కోర్టును ఆశ్రయించాలేమో.