తెలంగాణలో లాఠీ వర్సెస్‌ లాఠీ

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌పై గతంలో 'పోలీసు కొట్లాట' జరిగిన విషయం విదితమే. రైతులు, వారికి మద్దతుగా అధికారులు, ఈ మొత్తం తతంగానికి ప్రత్యక్ష సాక్షులుగా పోలీసు లాఠీలు.. వెరసి అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. నీటి పంపకాల వివాదం అది. 

ఈసారి, ఏకంగా తెలంగాణలో పోలీసులు వర్సెస్‌ పోలీసుల్లాంటి హోమ్‌గార్డుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తమ ఉద్యోగాల్ని రెగ్యులరైజ్‌ చేయాలనీ, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ, తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ గత కొద్ది రోజులుగా హోమ్‌గార్డులు తెలంగాణలో ఆందోళనబాట పట్టారు. ఆ ఆందోళన కాస్తా ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ సచివాలయం వైపుగా హోమ్‌గార్డులు దూసుకుపోవడంతో పోలీసులు లాఠీలు ఝుళిపించక తప్పలేదు. 

ఈ క్రమంలో హోమ్‌గార్డులు, పోలీసుల కాళ్ళు పట్టుకోవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. 'మీ కింద పనిచేసేటోళ్ళం.. మా సమస్యల కోసం పోరాడుతున్నాం.. మమ్మల్ని కొట్టొద్దు..' అంటూ హోమ్‌గార్డులు, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయితే, పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జి చేయక తప్పలేదు. 

హోమ్‌గార్డ్‌.. పేరుకే అది ఉద్యోగం. వెట్టిచాకిరీకన్నా హీనంగా హోమ్‌గార్డుల్ని పోలీసు శాఖ చూస్తుందనే ఆరోపణలున్నాయి. ఓ కానిస్టేబుల్‌ చేసే పనికన్నా ఎక్కువ పని హోమ్‌గార్డ్‌ చేస్తున్నా, హోమ్‌గార్డ్‌కి ఉద్యోగ భద్రత లేకపోవడంపై చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. అసలు హోమ్‌గార్డ్‌ అనేది ఉద్యోగమే కాదు. రోజువారీ వేతనం మాత్రమే హోమ్‌గార్డులకు ఇవ్వడం జరుగుతోంది. అనారోగ్యమొచ్చినా, ఇంకేం జరిగినా.. సెలవు పెట్టడానికి వీల్లేదు. సెలవు పెడితే, మరుసటి రోజు 'పని' పోయిన సందర్భాలెన్నో వున్నాయంటున్నారు హోమ్‌గార్డులు. 

మరోపక్క, హోమ్‌గార్డుల సమస్యల్ని పరిష్కరిస్తామంటోంది ప్రభుత్వం. ఇరువర్గాల మధ్యా చర్చలు జరగడం, కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం కుదరడం జరిగినాసరే, ప్రభుత్వం తరపున హామీలు లిఖితపూర్వకంగా రాకపోవడంతో ఉద్యమం ఉధృతరూపం దాల్చుతోంది. ఏదిఏమైనా, పోలీసు లాఠీ హోమ్‌గార్డ్‌ లాఠీపై విరుచుకుపడ్డం బాధాకరమే.

Show comments