ఆయన రాస్తే ఈ తరానికి విలువైన చరిత్రే...!

వార్త పత్రికలు చరిత్రకు అద్దం పడతాయని కొందరు చెబుతుంటారు. నిజమే..సమకాలీన చరిత్రను అవి నిక్షిప్తం చేస్తాయి. రాజకీయాలు, సామాజిక పరిణామాలు, పోరాటాలు, ఉద్యమాలు, ఆర్థికాంశాలు...ఒకటా రెండా? అనేక అంశాలను వార్తా పత్రికలు తెలియచేస్తాయి. విశ్లేషిస్తాయి. విశదీకరిస్తాయి. వార్తా పత్రికలు తమకు అందుబాటులో ఉన్న 'సోర్స్‌' మేరకు మాత్రమే వార్తలు, విశ్లేషణలు అందిస్తాయి. రాజకీయాల లోగుట్టు వ్యవహారాలు కూడా తెలియచేస్తాయి. కాని పాలిటిక్స్‌లో కొన్ని లోతైన విషయాలు, పరిణామాలు మీడియాకూ అందుబాటులో ఉండకపోవచ్చు లేదా తెలియకపోవచ్చు. 

అందుకే కొందరు నాయకులు రాసే ఆత్మకథలు లేదా వారి అనుభవాలు, జ్ఞాపకాలు, అలాగే కొందరు పాత్రికేయులు రాసే విశ్లేషణాత్మకమైన పుస్తకాలు వార్తా పత్రికలకు అందని చరిత్రను చెబుతాయి. చరిత్రకందని కొన్ని విషయాలు తెలియచేస్తాయి. రాజకీయాలంటే జనంలో సహజంగా ఆసక్తి ఎక్కువ కాబట్టి వారు రాసే పుస్తకాలు ఎక్కువగా చర్చనీయాంశమవుతాయి. కొన్ని పుస్తకాలు పెనుదుమారం సృష్టిస్తాయి. ప్రజలకు  సమకాలీన చరిత్ర ఎంత అవసరమో శ్రీశ్రీ అన్నట్లుగా  'అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు'. 

సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగి, ప్రభుత్వంలో అనేక కీలక పదవులు నిర్వహించిన నాయకులు తమ అనుభవాలను గ్రంథస్తం చేస్తే అవి ఆసక్తికరంగా ఉండటమే కాకుండా నడుస్తున్న తరం వారికే కాక భావితరాల నాయకులకూ పాఠాలుగా ఉపయోగపడే అవకాశముంటుంది. నిజమైన చరిత్ర ఇలాంటి పుస్తకాల ద్వారానే తెలుస్తుంది. తమ రాజకీయ జీవితాన్ని, అనుభవాలను పుస్తక రూపంలోకి తెచ్చిన అనేకమంది నాయకులున్నారు. అలనాటి నాయకుడు 'ఆంధ్రకేసరి' టంగుటూరి ప్రకాశం పంతులుగారి నుంచి ఇప్పటివరకు ఎందరో నాయకులు తమ అనుభవాలు ప్రజలతో పంచుకున్నారు. 

అయితే తెలుగు నాయకుల్లో ఇలాంటివారు తక్కువనే చెప్పుకోవాలి. కొందరు నాయకులపై వారి అభిమానులో, పాత్రికేయులో బయోగ్రఫీల రూపంలో రాసిన పుస్తకాలున్నాయి. కాని అవి ఆటోబయోగ్రఫీలంత (ఆత్మకథలు) లోతుగా ఉండవు. ఈ మధ్య కాలంలో కొందరు రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులూ తమ అనుభవాలను రాశారు. ఉద్యోగ జీవితంలో, ప్రభుత్వంలో వారికి ఎదురైన కష్టాలను, సమస్యలను, వాటిని తాము టాకిల్‌ చేసిన విధానాలను, తాము పనిచేసిన ముఖ్యమంత్రుల వ్యవహారశైలిని, వారి నిర్ణయాలను, ఆ సమయంలో తమ పాత్రను వివరిస్తూ రాసిన పుస్తకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 

పీవీఆర్‌కే ప్రసాద్‌, హెచ్‌జె దొర, రావులపాటి సీతారామరావు, ఇంకొందరు అధికారులు పుస్తకాలు రాశారు. ఇవన్నీ వారి ఉద్యోగ జీవితానికి పరిమితమయ్యాయి. సివిల్‌ సర్వీసు అధికారుల అనుభవాలు చదువుతున్నప్పుడు ఆ జాబ్‌ ఎంత క్లిష్టమైందో, ఎంత టెన్షన్‌ ఉంటుందో అర్థమవుతుంది. ఈమధ్య కాలంలో వినయ్‌ సీతాపతి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గురించి రాసిన 'హాఫ్‌ లయన్‌' (తెలుగులో నరసింహుడు పేరుతో అనువాదం) జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. పీవీపై ఎన్నో పుస్తకాలు వచ్చినప్పటికీ  ఇంత పరిశోధనాత్మక పుస్తకం రావడం ఇది తొలిసారి. 

రాష్ట్ర విభజన చట్టం తయారీలో కీలక పాత్ర పోషించిన మాజీ కేంద్ర మంత్రి జయరామ్‌ రమేష్‌ విభజనకు సంబంధించిన తెరచాటు విషయాలతో ఈమధ్య పుస్తకం వెలువరించారు. ఇలా చెప్పుకుంటేపోతే అనేకమున్నాయి. ఈమధ్యే తమిళనాడు గవర్నరుగా పదవీ విరమణ చేసిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని లేదా తన అనుభవాలను గ్రంథస్తం చేస్తే బాగుంటుంది. పదవీ విరమణ తరువాత తొలిసారి ఓ తెలుగు టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ జీవితం గురించి ఎలాంటి పుస్తకం రాసే ఆలోచన లేదని, తాను గొప్ప వ్యక్తిని కానని చెప్పారు.

 గొప్పవాడిని కానని చెప్పడం ఆయన వినయానికి నిదర్శనం. 18 ఏళ్ల వయసులో ఆంధ్రరాష్ట్ర ఉద్యమం (అప్పటి మద్రాసు స్టేట్‌ నుంచి విడిపోవడానికి) ద్వారా రాజకీయాల్లోకొచ్చి 84 ఏళ్ల వయసులో విశ్రాంతి తీసుకునే దశకు చేరుకున్నారు. ఎందరో సీఎంల దగ్గర మంత్రిగా పనిచేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా రికార్డు సృష్టించారు. 

జీవితమంతా ఒకే పార్టీలో కొనసాగడం, వినయవిధేయలతో ఉండటం విశేషం. అందులోనూ వివాదరహితుడు. గ్రూపులు గట్రా లేవు. ఇలాంటి నాయకుడు తన అనుభవాలను గ్రంథస్తం చేస్తే సమకాలీన తరానికే కాకుండా భావి తరాలకూ విలువైన చరిత్రగా మిగులుతుంది. ఈరోజుల్లో సినిమా తారలు కూడా ఆటోబయోగ్రఫీలు రాస్తున్నప్పుడు రోశయ్యవంటి కురువృద్ధుడు రాయకపోవడం లోటుగా ఉంటుంది. 

Show comments