ట్రంపు.. కంపు కొట్టించేస్తున్నాడోచ్‌

డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైతే ఎలా వుంటుంది.? అంటూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వం ఖరారయినప్పటినుంచీ ప్రపంచమంతా విశ్లేషించుకుంటూనే వుంది. మన తెలుగు మీడియా ఇందుకు మినహాయింపేమీ కాదు. అమెరికా అంటే అగ్రరాజ్యం. అక్కడ అధ్యక్ష పీఠం ఎవరెక్కితే పరిస్థితులు ఎలా వుంటాయోనన్న టెన్షన్‌ ప్రపంచమంతటికీ వుండడం సహజమే. మన తెలుగువారి పరిస్థితేంటి.? అన్న అనుమానాలూ మామూలే కదా. 

ఎలాగైతేనేం, ట్రంప్‌ సంచలనం సృష్టించేశాడు. హిల్లరీ క్లింటన్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచేస్తుందనుకుంటే, ట్రంప్‌ అనూహ్య విజయాన్ని అందుకున్నాడు. అంతే, ఇక ప్రపంచమంతా షాక్‌కి గురవ్వాల్సి వచ్చింది. అయ్యిందేదో అయిపోయింది, ఇక మాట్లాడుకోడానికేమీ లేదని అంతా డీలా పడిపోయారు. కానీ, ప్రపంచానికి ఇప్పుడే షాక్‌లు మొదలవుతున్నాయి. 

ఇంకా అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోలేదుగానీ, అప్పుడే ఆయా దేశాలతో 'సన్నిహిత' సంబంధాలు షురూ చేసేశాడు ట్రంప్‌. భారత్‌ని ఉద్ధరించేస్తాడనుకుంటే, భారత్‌కి బద్ధ శతృవైన పాకిస్తాన్‌కి స్నేహహస్తం అందించబోతున్నాడు. చైనా అంటే అమెరికాకి ఎప్పుడూ గిట్టదు. ఆ చైనాకి వ్యతిరేకంగా కూడా ట్రంప్‌ పావులు కదపడం మొదలు పెట్టేశాడు. ముందు ముందు రష్యాకి వ్యతిరేకంగానూ ట్రంప్‌ చర్యలు షురూ చేస్తాడనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. 

హిల్లరీతోనే భారత్‌కి కష్టం.. హిల్లరీతోనే చైనాకి నష్టం.. హిల్లరీతోనే రష్యాకి ప్రమాదం.. అని ప్రపంచమంతా భావించింది. కానీ, ట్రంప్‌ సైతం ఇప్పుడు భారత్‌, చైనా, రష్యాలకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాడు. దాంతో, ప్రపంచమంతా ఇప్పుడు ఆందోళన చెందాల్సి వస్తోంది. ఎందుకంటే రష్యా, చైనా, భారత్‌తో అమెరికా సంబంధాలు ప్రపంచానికి మేలు చేస్తాయని ప్రపంచమంతా భావించింది. 

ప్రస్తుతం ట్రంప్‌ ఏ చర్యలు చేపట్టినా, అవేవీ అధికారికం కావు.. ఆ చర్యల వల్ల ఎవరికీ నష్టం లేదు. కానీ, అమెరికా అధ్యక్ష పీఠమెక్కాక కూడా ఇలాగే వ్యవహరిస్తేనో.! మొత్తమ్మీద, ట్రంప్‌ తన చర్యలతో ఎన్నికల ప్రచారంలోనే 'కంపు' కొట్టించేశాడు.. ఇప్పుడేమో, ఇదిగో ఇలా.. వివిధ దేశాలతో సత్సంబంధాల విషయంలోనూ 'కంపు' కొట్టించేస్తున్నాడన్నమాట.

Show comments