కేవలం పవన్ కల్యాణ్ అనే కాదు.. ఏ పెద్ద హీరో సరసన తొలి సినిమాలో నటించే కొత్త హీరోయిన్లకు అయినా ఇలాంటి ప్రమాదం పొంచి ఉంటుంది. భారీ అంచనాల మధ్యన వచ్చే ఆ సినిమాల్లో నటించే వీరిపై అందరి దృష్టీ పడుతుంది. సదరు సినిమా హిట్టైతే పర్వాలేదు, లేకపోతే మాత్రం సదరు హీరోయిన్ ని ఎవ్వరూ పట్టించుకోరు! ఆ ప్లాఫ్ సినిమా ఆ హీరోని పెద్దగా ఇబ్బంది పెట్టదు కానీ, శుభమా అంటూ మొదలయ్యే ఆ హీరోయిన్ కెరీర్ ను మాత్రం అతలాకుతలం చేసేస్తుంది!
ఇలాంటి బాధితురాల్లో ఒకరు నికీషా పటేల్. ఐదారేళ్ల కిందట వచ్చిన పవన్ కల్యాణ్ సినిమా ‘కొమరం పులి’ తో కెరీర్ ను మొదలుపెట్టిన నటీమణి ఈమె అని వేరే చెప్పనక్కర్లా. అత్యంత భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా అదే స్థాయి డిజాస్టర్ గా నిలిచిపోయింది. పవన్ కెరీర్ కు ఆ సినిమా పెద్దగా ఇబ్బందిని కలిగించలేదు కానీ.. నికీషా కెరీర్ ను మాత్రం మళ్లీ కోలుకోనివ్వలేదిప్పటి వరకూ!
ఆ సినిమా తర్వాత ఈమెకు అడపాదడపా అవకాశాలు వచ్చినా.. ఇప్పటికీ ఈమెను ప్లాఫైన కొమరం పులి హీరోయిన్ గానే చూస్తారంతా! ఈ విషయాన్ని చెప్పుకునే వాపోతోంది ఈ గుజరాతీ భామ.
తను బాలీవుడ్ లో ప్రయత్నాలు చేసుకుందామనుకున్నాను అని, ఏవైనా చిన్న సినిమాలైనా చేద్దాం అనుకుంటే.. ఎస్జే సూర్య ఒత్తిడి తెచ్చి.. తనను ఒప్పించాడని, తీరా ఆ సినిమా డిజాస్టర్ అయ్యే సరికి అవకాశాలు రాలేదని, ఇప్పుడిప్పుడే కొత్త ఛాన్సులు సంపాదించుకుంటున్నానని నికీషా చెప్పింది. ఒకవేళ ‘కొమరం పులి’ గనుక హిట్టై ఉంటే.. మాత్రం ఈమె కెరీర్ ఇప్పుడు మరో రేంజ్ లో ఉండేదని చెప్పవచ్చు. కేవలం నికీషా కే కాదు.. ఎంట్రీతోనే స్టార్ హీరోల సరసన చేస్తే ఏ హీరోయిన్ కెరీర్ అయినా లాటరీ టికెట్ లాంటిదే!