అన్నీ తనే.. ఆయన మారడంతే!

ఇలా చెప్పుకుంటే.. వినే వాళ్లు నవ్వుకుంటారేమో అనే భయం భక్తీ ఏమీ లేదు. ఇది సోషల్ నెట్ వర్కింగ్ యుగం.. గూగుల్ యుగం.. ఒక క్లిక్ తో సమస్త సమాచారాన్నీ జనాలు తెలుసుగోలరు.. అనే అవగాహన ఉండి మాట్లాడతాడో లేక.. ఇలా కామెడీ చేయడం అలవాటుగా మారిపోయిందో కానీ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి నవ్వుల పాలయ్యేలా తన డప్పు తను కొట్టుకున్నాడు.

ఏ విప్లవాత్మక మార్పు విషయంలో అయినా .. దాని వెనుక తనే ఉన్నాను, మంచి సక్సెస్ సాధించిన వ్యక్తి గురించి అయినా.. వారి వెనుక నేనే ఉన్నాను.. అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తాజాగా మరో సారి చెప్పిన మాట.. “డ్వాక్రాను నేనే..’’ అనేది!

మరి ఆయన మాటలను వినే అమాయక మహిళలు ఈ విషయాన్ని ఎంత వరకూ నమ్ముతున్నారో తెలియదు కానీ.. బాబు మాటల్లోని సత్యసంధత ఎంతో తెలుసుకోవడానికి ఒక్క గూగుల్ సెర్చ్ చాలు! ఈ డ్వాక్రా అనే కాన్సెప్ట్ బంగ్లాదేశ్ లో పుట్టిందని.. దాన్ని భారత ప్రభుత్వం 70లలోనే అందిపుచ్చుకుందని.. Development of women and children in Rural Areas (DWACRA) గా దాన్ని ప్రారంభించారని.. అప్పటి నుంచి ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమంగా కొనసాగుతోందని స్పష్టం అవుతుంది. 

తను రాజకీయ ఓనమాలు దిద్దుకుంటున్న దశలో.. ఎక్కడో పక్క దేశంలో పుట్టిన కాన్సెప్టును చంద్రబాబు ఓన్ చేసుకుంటున్నాడు. “మహిళలు ఆత్మగౌరవంగా బతకాలని, సమానహక్కులు ఉండాలనే ఉద్దేశంతో గతంలో నేనే చిన్న కార్యక్రమంగా డ్వాక్రా వ్యవస్థను ప్రారంభించా..’’ అని బాబు చెప్పుకొచ్చాడు! ఈ విధంగా తనే మహిళలకు పొదుపు నేర్పాను అని కూడా బాబు ఢంకా భజాయించాడు!

ఈ డ్వాక్రా పథకం గురించి కూలంకషంగా పరిశీలిస్తే.. ఈ వ్యవస్థ విస్తృతం కావడంలో పీవీ కృషి ఉంది.. అనేది స్పష్టం అవుతోంది. డ్వాక్రా వ్యవస్థను బ్యాంకులతో అనుసంధానం చేసి.. మహిళలు స్వయం సహాయకంగా ఎదిగేందుకు పీవీ హయాంలో బీజాలు పడ్డాయి. వారందరి తర్వాత వచ్చిన బాబు మాత్రం తనే డ్వాక్రాను కనుగొన్నా అని చెప్పుకొంటూ నవ్వుల పాలవుతున్నాడు.

ఇక తన తర్వాత డ్వాక్రా మహిళలకు ఎవరూ ఏం చేయలేదనేది బాబు చెప్పే మరో మాట! మరి పావలా వడ్డీకే రుణాలు అంటూ వైఎస్ చేసిన పనిని కూడా బాబు ఒప్పుకోవడంలా! దాన్ని దాచేస్తున్నాడు.

మహిళల ఆత్మగౌరవం .. అంటూ బాబు మాట్లాడుతుండటం మరో ప్రహసనం. డ్వాక్రా రుణమాఫీ అంటూ.. తనకు చేతగాని హామీని ఇచ్చి, మహిళలకు ఆ ఆశ పెట్టి ఓట్లు వేయించుకుని.. తీరా అధికారంలోకి వచ్చాకా ఆ హామీని అమలు చేయక.. బ్యాంకుల వద్ద పొదుపు సంఘాల మహిళల పరువు తీసింది, బ్యాంకులకు నమ్మకమైన కస్టమర్లుగా ఉండిన వాళ్లను డీఫాల్టర్లుగా తయారు చేసింది చంద్రన్నే! బాబు రుణమాఫీ హామీని ఇచ్చిన దగ్గర నుంచి ఏపీలో డ్వాక్రా వ్యవస్థ చాలా వరకూ నిర్వీర్యం అయ్యింది. ఈ పరిస్థితే కొనసాగుతోంది.

ఇలాంటి తరుణంలో.. డ్వాక్రాను నేనే కనుగొన్నా.. మహిళల ఆత్మగౌరవాన్ని నేనే కాపాడుతున్నా.. వారికి పొదుపు నేనే నేర్పా.. అంటూ బాబు చెప్పుకోవడాన్ని ఏమనాలో ఈయనపై కారాలూ మిరియాలూ నూరుతున్న డ్వాక్రా మహిళలే చెప్పాలి!

Show comments