ఉద్దానం వ్యధ.. పవన్‌కళ్యాణ్‌కి అర్థమయ్యేనా.?

ఉద్దానం.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి పరిచయమయ్యిందెలాగో తెలుసా.? కిడ్నీ బాధితుల పరంగా. ఉద్దానం ప్రాంతమంటే కేరళ కొబ్బరి తోటల్ని తలపిస్తుంది.. కోనసీమను తలదన్నేలా వుంటుంది. ఉత్తరాంధ్రలోని మారుమూల ప్రాంతమిది. శ్రీకాకుళం జిల్లాలో వుందీ ప్రాంతం. ఒకప్పటి ఉద్దానం చరిత్ర వేరు, ఇప్పుడు ఉద్దానం పరిస్థితి వేరు. ఉద్దానం అంట, కిడ్నీ రోగులే గుర్తుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో.. ఆ మాటకొస్తే, తెలుగు రాష్ట్రాల్లో.. ఇంకా చెప్పాలంటే.. దేశంలోనే ఉద్ధానం కిడ్నీ వ్యాధి బాధితులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. 

కిడ్నీ సమస్యలతో ఎవరన్నా డాక్టర్‌ వద్దకు వెళితే, 'మీరెక్కడినుంచి వచ్చారు.?' అనడిగి, 'శ్రీకాకుళం జిల్లా'ని కన్‌ఫామ్‌ చేసుకోవడం కిడ్నీ వైద్యులకు సర్వసాధారణమైన విషయమే. ఆ స్థాయిలో ఉద్దానం కిడ్నీ వ్యాధులతో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడీ ఉద్దానం మరోమారు వార్తల్లోకెక్కింది.. జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ పర్యటన కారణంగా. రేపు శ్రీకాకుళం జిల్లాలో పవన్‌కళ్యాణ్‌ పర్యటించనున్న విషయం విదితమే. 

జనసేన పార్టీని బలోపేతం చేసే క్రమంలో తిరుపతి, కాకినాడ, అనపంతపురంలలో ఇప్పటికే పర్యటించి, బహిరంగ సభలు నిర్వహించిన పవన్‌కళ్యాణ్‌, ఆ క్రమంలోనే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు వెళుతున్నారు. అయితే, మిగతా రాజకీయ కార్యక్రమాలతో ఉద్దానం టూర్‌ని పోల్చలేం. తొలుత ఉద్దానంలో పర్యటించాలని పవన్‌కళ్యాణ్‌ అనుకున్నా, పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. 500 మంది కిడ్నీ బాధితుల్ని ఎంపిక చేసి, వారితో పవన్‌కళ్యాణ్‌ సమావేశాన్ని ఇచ్చాపురంలో ఏర్పాటు చేస్తున్నారు. 

ఒకరా.? ఇద్దరా.? ఏకంగా ఉద్దానం ప్రాంతంలో 70 వేల మందికి పైగా కిడ్నీ వ్యాధి పీడితులున్నారు. అసలు ఎందుకు ఈ వ్యాధి వస్తోంది.? అన్నది ఇప్పటికీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక పరిశోధనలు జరిగాయి. అంతర్జాతీయ స్థాయిలోనూ కీడ్నీ వ్యాధి పీడిత ఉద్దానంపై పరిశోధనలు జరిగాయిగానీ, 'గుట్టు' మాత్రం వీడటంలేదు. ఈ పరిస్థితుల్లో పవన్‌కళ్యాణ్‌ ఉద్దానం పర్యటన, కిడ్నీ బాధితులకు ఎంత ఊరటనిస్తుంది.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. 

నాయకులు వస్తున్నారు, వెళుతున్నారు.. వైద్యులంటూ కొందరు పరిశోధనలకు వస్తున్నారు, వెళుతున్నారు.. ఉద్దానం దశ మాత్రం మారడంలేదు. ప్రాణాలు పోవడం ఓ ఎత్తు.. జీవచ్ఛవాలుగా బతకడం ఓ ఎత్తు. ఇది ఉద్దానం దయనీయ స్థితి. మంత్రులు, ముఖ్యమంత్రులే పట్టించుకోని ఉద్దానం.. పవన్‌ రాకతో మరోసారి వార్తల్లోకి ఎక్కడ ంద్వారా, ఉద్దానం దీనగాధ ప్రపంచానికి మరోమారు తెలిసే అవకాశమైతే లేకపోలేదు.

Show comments