స్పెషల్‌ వార్‌: జగన్‌ వర్సెస్‌ పవన్‌

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా సెగలు భగ్గుమంటున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా 'ఆంధ్రప్రదేశ్‌ యువత' పేరుతో యువతరం పెద్దయెత్తున పోరాటం షురూ చేసింది. రేపు, జనవరి 26న విశాఖలోని ఆర్‌కే బీచ్‌ నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికీ, అటు కేంద్ర ప్రభుత్వానికీ 'బుద్ది వచ్చేలా' శాంతియుత పోరాటం చేస్తామంటోంది యువతరం. 

ఇక, ఈ పోరాటానికి సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ మద్దతిచ్చిన విషయం విదితమే. మరోపక్క, వైఎస్సార్సీపీ కూడా యువత పోరాటానికి మద్దతిస్తూనే, పార్టీ తరఫున కొవ్వొత్తుల ర్యాలీ, శాంతియుత నిరసన వంటి కార్యక్రమాలు చేపడ్తోంది. ఇక్కడే అటు జనసేనకీ, ఇటు వైఎస్సార్సీపీకీ మధ్య 'క్లాష్‌' కన్పిస్తోంది. 

అందరికీ తెల్సిన విషయమే, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ అటు బీజేపీకీ, ఇటు టీడీపీకీ అత్యంత సన్నిహితంగా వుంటారని. అదే సమయంలో వైఎస్‌ జగన్‌, ఆ రెండు పార్టీలకీ వ్యతిరేకి. ఇంకేముంది, పవన్‌ - జగన్‌ మద్దతుదారులు సోషల్‌ మీడియాలో రెండుగా చీలిపోయి, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. 'ఆంధ్రప్రదేశ్‌ యువత' చేపడ్తున్న ఉద్యమానికి ఇద్దరూ మద్దతివ్వడం సంగతేమోగానీ, హోదా కోసం యువత చేస్తున్న ఉద్యమంలో రెండు వర్గాలు ఏర్పడటంతో అసలుకే మోసమొచ్చేలా కన్పిస్తోంది. 

'పార్టీలకతీతంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలోకి ఏ పార్టీ జెండానీ ఎవరూ తీసుకురావొద్దు..' అంటూ ఆంధ్రప్రదేశ్‌ యువత, సోషల్‌ మీడియా ద్వారా సందేశాలు పంపుతోంది. అయినాసరే, ఆ ఆందోళనల్లో రాజకీయ జెండాలు కన్పించకుండా వుంటాయా.? తమిళనాడులో జల్లికట్టు కోసం యువత చేసిన పోరాటంలో మాత్రం జెండాలు కన్పించలేదు. అయితే, ఇక్కడ ఆ పరిస్థితి వుండకపోవచ్చు. ఒకవేళ జెండాలు పక్కన పెడితే మాత్రం, యువత చేపట్టిన కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తవుతుంది. జెండాలు కన్పిస్తే మాత్రం రచ్చ తప్పదు. 

ఈ విషయంలో ఇటు జనసేన, అటు వైఎస్సార్సీపీ తమ తమ కార్యకర్తలకు, మద్దతుదారులకు 'సిన్సియర్‌ అప్పీల్‌' చేస్తే మంచిదేమో.!

Show comments