ఈ గాడిదల గోలేంటి మోడీజీ.!

గాడిదలు చాలా కష్టపడి పనిచేస్తాయట.. అలా పనిచేసే గాడిదనని చెప్పుకుంటున్నారు ప్రదానమంత్రి నరేంద్రమోడీ. అవును మరి, ఇది ఎన్నికల వేళ కదా. గాడిద అన్నా, ఇంకేదన్నా భరించేస్తారు. ఎందుకంటే, ఎన్నికల వేళ ఓటరు దేవుళ్ళ 'కరుణ' కావాలి మరి. 

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌, 'గుజరాత్‌ గాడిదలు..' అంటూ చేసిన వ్యాఖ్యలకి మోడీ ఇలా కౌంటర్‌ ఇచ్చారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! గాడిదలు యజమాని చెప్పిన పని చెప్పినట్టే చేస్తాయట. ఇక్కడ యజమాని అంటే ప్రజలన్నమాట. అవునా.? అలాగైతే, 2014 ఎన్నికల్లో చెప్పిన పనులు నరేంద్రమోడీ ఎందుకు చేయలేదట.? విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తామన్నారు, ఏదీ ఎక్కడ.? 

పెద్ద పాత నోట్ల రద్దుతో సాధారణ ప్రజానీకాన్ని రోడ్డున పడేశారు నరేంద్రమోడీ. నల్లదొంగలెవరూ రోడ్డెక్కలేదు. అంటే, 'గాడిద' ఎవరి కోసం పని చేస్తున్నట్లు.? ప్రజల తరఫునా, నల్లదొంగల తరఫునా.? ప్రధాని నరేంద్రమోడీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వుంటుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు రావొచ్చు, రాకపోనూవచ్చు. ఎన్నికల మాయాజాలం ఎలా వుంటుందో ఎవరూ ఊహించలేరు. ఫలితాలెలా వచ్చినా, ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం ఎలా సృష్టించి, రాజకీయాల్ని ఎలా తనవైపుకు తిప్పుకోవాలో నరేంద్రమోడీకి బాగా తెలుసు. 

తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు, తమిళనాడులో రాజకీయ సంక్షోభం, ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో బీజేపీ సృష్టించిన గందరగోళం.. ఇవన్నీ చూశాక, అసలంటూ ఈ ఎన్నికల ప్రసహనమ్మీదే అసహ్యం వేస్తుంది. గతంలోనూ ఈ తరహా నీఛ రాజకీయాలున్నా, నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక.. అవి పతాక స్థాయికి చేరుకున్నాయన్నది నిర్వివాదాంశం. ప్రజాస్వామ్యంలో పాలకులే సేవకులన్నది వెనకటి మాట. ఇప్పుడు పాలకులంటే డిక్టేటర్స్‌.. డిక్టేటర్‌ అనేవాడు, గాడిద ఎలా అవుతాడట.?

Show comments