వావ్‌.. పాకిస్తాన్‌ గురించి మాట్లాడేస్తున్నారోచ్‌.!

ఆయనో ఎంపీ.. పార్లమెంటు సభ్యుడంటే.. జాతీయ స్థాయిలో పలుకుబడి వుంటుంది.. జాతీయ స్థాయి రాజకీయాలపైనా అవగాహన వుంటుంది. కాబట్టి, ఏ విషయమ్మీద అయినా మాట్లాడొచ్చుగాక. కానీ, పాకిస్తాన్‌ గురించి మాట్లాడేస్తే ఎలా.? పైగా, పాకిస్తాన్‌తో యుద్ధమే బెటర్‌.. అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చేస్తే, రాజకీయ నాయకుడిగా ఆయనకున్న అవగాహన ఏపాటిది.? అని అనుకోకుండా వుండగలమా.? 

పరిచయం అక్కర్లేదు ఆయన గురించి ప్రత్యేకంగా. జేసీ దివాకర్‌రెడ్డి అంటే తెలుగునాట రాజకీయాల్లో అందరికీ సుపరిచితుడైన వ్యక్తే. కాంగ్రెస్‌లో వుండి, కాంగ్రెస్‌ని విమర్శించడంలో ఆయనకు ఆయనే సాటి. టీడీపీలోనూ అప్పుడప్పుడూ చంద్రబాబుపై సెటైర్లు వేస్తారు, ఇరకాటంలో పడేస్తారు, అంతలోనే చంద్రబాబుని వెనకేసుకొస్తారు. పైగా, 'ముక్కుసూటితనం' అనే ట్యాగ్‌లైన్‌ వేసుకు తిరుగుతుంటారాయన. 

అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్‌రెడ్డికి 'ఫ్యాక్షనిస్ట్‌' అనే ట్యాగ్‌లైన్‌ వుందండోయ్‌. పరిటాల రవికి అప్పట్లో ఈయన రాజకీయ, ఫ్యాక్షన్‌ ప్రత్యర్థి. ఇలాంటి వ్యక్తి, పాకిస్తాన్‌తో యుద్ధమే బెటర్‌.. పది కోట్ల మంది చచ్చిపోయినాసరే, అఖండ భారతావని వుంటే బావుంటుంది.. అంటూ నోటికొచ్చిందేదో మాట్లాడేశారు. పాకిస్తాన్‌దాకా ఎందుకు.? ఉమ్మడి తెలుగు రాష్ట్రం విషయంలో ఈయనగారు చేసిందేంటి.? 

రాయల తెలంగాణ కావాలన్నారు.. రాష్ట్రం విడిపోకూడదన్నారు.. కాంగ్రెస్‌ నేతగా, మంత్రిగా తన ప్రాంత ప్రయోజనాలకు సంబంధించి కాంగ్రెస్‌ అధిష్టానంపైనే ఒత్తిడి తీసుకురాలేకపోయారు. ఇప్పుడేమో, ఈయనగారు ఏకంగా పాకిస్తాన్‌ గురించి మాట్లాడేస్తోంటే, నవ్వాలో ఏడవాలో కూడా ఎవరికీ తెలియడంలేదు. యుద్ధం నేది ఎప్పుడూ 'లాస్ట్‌' ఆప్షన్‌ మాత్రమే. అసలు దాన్ని ఆప్షన్‌గా భావించడానికే ఎవరూ సాహసించరు. చేతకానితనం కాదది. యుద్ధం తీసుకొచ్చే వినాశనం అలా వుంటుంది. 

పైగా, పాకిస్తాన్‌ ఏమన్నా ఆషామాషీ దేశమా.? పిచ్చోడి చేతిలో రాయిలా పాకిస్తాన్‌ చేతిలో అణ్వాయుధాలున్నాయి. ముందంటూ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడి, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ఒత్తిడి తీసుకొచ్చి, రాష్ట్రాభివృద్ధికి ఎంపీగా కృషి చేస్తే.. ఆ తర్వాత దేశం ఎదుర్కొంటోన్న పాకిస్తాన్‌ గురించి మాట్లాడేయొచ్చు.. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిగారూ వింటున్నారా.?

Show comments