కోటి.. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు.!

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 13 జిల్లాలు.. ఒక్కో జిల్లాకి ఒక్కో కోటి.. అంటే మొత్తం 13 కోట్ల రూపాయల్ని, క్రీడాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేసింది. కోటి అంటే, ఒకటి పక్కన ఎన్ని సున్నాలు.? ఆ విషయం పక్కన పెడదాం. కోటి అంటే, 100 లక్షలు. లక్ష అంటే, 100 వేలు, వెయ్యి అంటే, 10 వందలు. 

ఇప్పుడీ లెక్కలేంటని అనుకుంటున్నారా.? ఆ లెక్కలకే వచ్చేద్దాం. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఏపీలో క్రీడలపై సమీక్ష జరిపారు. ఈ సమీక్ష సందర్భంగా మొత్తం అన్ని జిల్లాల్లోనూ క్రీడీ ప్రాంగణాల నిర్మాణం చేపడతామని సెలవిచ్చారు. అంటే, ఇప్పటిదాకా ఆయా జిల్లాల్లో స్టేడియంలు లేవనుకోవాలా.? ఏమోగానీ, ఒక్కో జిల్లాకి ఒక్కో కోటి చొప్పున ప్రకటించేసిన అచ్చెన్నాయుడు, 100 మంది కోచ్‌లను ఎంపిక చేసి, క్రీడాకారులకు శిక్షణ ఇప్పించేస్తామని ప్రకటించారు. 

కోటి రూపాయలతో క్రీడా ప్రాంగణం నిర్మితమైపోతుందా.? కాస్త ఆలోచించాల్సిన విషయమే. క్రీడల పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి వుందో ఇక్కడే అర్థమయిపోతోంది. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధుకి 3 కోట్లు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌. అదంటే పబ్లిసిటీ వ్యవహారం. దానికోసం ఎంతైనా ఖర్చు చేయొచ్చు. ఎందుకంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిసిటీ కోసం ఏమైనా చేసేస్తారు మరి.! 

ఓ క్రీడాకారిణికి ఆమె సాధించిన విజయానికి గుర్తింపుగా 3 కోట్లు బహుమతిని ప్రకటించడాన్ని తప్పు పట్టలేం. కానీ, అలాంటి క్రీడాకారుల్ని తయారు చేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు చేయాలి.? 100 కోట్లు ఖర్చు చేసినా తక్కువే. కానీ, 13 కోట్లు విదిలించేసి, ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాభివృద్ధికి కృషి చేసేస్తారట. అసలు కోటిలో ఒకటి పక్కన ఎన్ని సున్నాలు వుంటాయో తెలుసా అధికారంలో వున్నవారికి.? అన్న అనుమానం ఇదిగో, ఇలాంటి సందర్భాల్లోనే కలుగుతుంది. 

తమ ప్రభుత్వ గొప్పతనం గురించి పత్రికల్లో ఇచ్చుకునే ప్రకటనలు, ఛానళ్ళలో వేసుకునే ప్రకటనలు, తమ విలాసవంతమైన పర్యటనల కోసం చేసే ఖర్చు.. వీటితో పోల్చితే ప్రభుత్వం, క్రీడల కోసం చేస్తున్న ఖర్చు ఏపాటిది.? ఆంధ్రప్రదేశ్‌ అనే కాదు, తెలంగాణ అనే కాదు.. దేశంలో క్రీడారంగం పట్ల పాలకులు చూపుతున్న నిర్లక్ష్యమే.. దేశంలో క్రీడల పాలిట శాపంగా మారుతోంది.

Show comments