ఏం సాధిస్తున్నారీ నిర్మాతలు?

వారం వారం సినిమాలు వస్తున్నాయి..పోతున్నాయి. కోట్ల కొద్దీ డబ్బులు టాలీవుడ్ లోకి వస్తోంది..పోతోంది. ఏడాదికి వందకు పైగా సినిమాలు. కానీ చాలా సినిమాల గురించి ఆలోచిస్తుంటే, అసలు ఈ నిర్మాతలు ఏం సాధిస్తున్నారు అనిపించక మానదు. కోట్లన్న ఆస్తులు అమ్మో, వడ్డీకి తెచ్చో టాలీవుడ్ లో పోస్తున్నారు. కానీ తిరిగి ఏరుకునే పనిలో విజయం సాధించిన వారు ఒక్కశాతం మంది కూడా వుండడం లేదు. ఏం సుఖం ఈ నిర్మాతలకు? 

కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు అన్ని రకాల టెన్షన్లు భరించి, నిద్రలేని రాత్రులు గడిపి, నాలుగు నుంచి అయిదు రూపాయిలు వడ్డీలు కట్టి, సినిమా విడుదలయిన తరువాత కూడా రావాల్సిన డబ్బులు రాక, ఓవర్ ఫ్లోస్ అంటే పలకాల్సిన వారు ఫోన్ లు తీయక, ఇవ్వాల్సిన బాకీల వాళ్ల నుంచి ఫోన్ లు ఆగక, ఇలా ఒకటేమిటి  సవాలక్ష సమస్యలు. అయినా అందరినీ చూస్తున్నా కూడా ఎందుకు సినిమాలు తీస్తున్నట్లు అంటే..అదంతే..అదో మాయ. ఆ మాయలో పడినవారు అలా తీస్తూనే వుంటారు.

ఇటీవల విడుదలైన ఓ సినిమా నిర్మాత 18 కోట్లు రీళ్లపాలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు ఏం చెప్పారట..గ్రాస్ లెక్కలు చెప్పారట. ఆ హీరో ఇంతకు ముందు సినిమా ముఫై కోట్లు చేసింది, పాతిక కోట్లు చేసింది అని. అంతే కానీ, అందులో షేర్ ఎంత? ఖర్చలు ఎంత అన్న దానిపై పాపం ఆయనకు అవగాహన లేదు.

ఆ మధ్య బ్లాక్ బస్టర్ అనుకున్న ఓ టాప్ డైరక్టర్ సినిమా నిర్మాతకు రెండు కోట్ల లాస్. ఈ నెలలోనే విడుదలైన ఓ సినిమా కోసం నిర్మాత స్థలం తాకట్టు పెట్టి వెస్ట్ కు చెందిన ఓ ఫైనాన్షియర్ దగ్గర నాలుగు రూపాయల వడ్డీకి ఆరు కోట్లు తెచ్చారు. ఏడాది పాటు వడ్డీ కట్టారు. అంటే ఎంత కట్టినట్లు? దగ్గర దగ్గర మూడు కోట్లు. ఈ మధ్యనే విడుదలైన ఓ ఏవరేజ్ సినిమా నిర్మాత కు కోటిన్నర నష్టం అయితే, ఆయన అప్పు తెచ్చిన ఫైనాన్షియర్ కు ఆ సినిమా వల్ల కోటిన్నర లాభం అంట. Readmore!

ఆ మధ్య ఓ సినిమా తీసి 10 కోట్లు పోగొట్టుకున్న నిర్మాత, తన ల్యాండ్ అమ్మి, ఆ సినిమా కోసం అప్పు ఇచ్చిన సీమ రాజకీయ ప్రముఖుడి బాకీ తీర్చాల్సి వచ్చింది. ఓ యంగ్ హీరోతో రెండేళ్ల క్రితం సూపర్ హిట్ ఇచ్చిన నిర్మాత, ఆ సినిమాకు గాను రెండు కోట్లు నష్టం చవిచూసారంటే నమ్మగలమా? పేరు మాత్రం ఫలానా హిట్ సినిమా నిర్మాత అని మిగిలిపోయింది. 

ఈ ఏడాది ప్రారంభంలో ఓ యంగ్ టాప్ హీరోతో సూపర్ హిట్ ఇచ్చిన నిర్మాతకు లాభాలే రాలేదంటే నమ్మగలమా? కొన్నాళ్ల క్రితం ఓ అగ్ర నటుడితో సినిమా తీసిన నిర్మాత తన రైస్ మిల్లుతో సహా చాలా అమ్ముకోవాల్సి  వచ్చింది. ఓ నిర్మాతకు డబ్బు అప్పు ఇచ్చిన ఓ వ్యక్తి ఇలా జోక్ వేసాడు..’ నా పేరు సమర్పించు అని వేస్తాం అంటే ఏమో అనుకున్నా..సమర్పించు అంటే డబ్బులు సమర్పించుకోవడం అని అప్పుడు అర్థం కాలేదు..తరువాత నా డబ్బులు రానప్పుడు తెలిసింది’ అంటూ.

ఓ నిర్మాత తన సినిమాకు టేబుల్ ప్రాఫిట్ గ్యారంటీ అన్నాడట. నిజంగానే టేబుల్ ప్రాఫిట్ వచ్చిందట. ఎలా అంటే సినిమా విడుదలైపోయాక, ఆయనకు ఆఫీసులో టేబుల్ ఒక్కటే మిగిలిందట. చాలా మంది టేబుల్ ప్రాఫిట్ అని చెప్పడం అంటే ఇదే అని ఓ అనుభవశాలి జోక్ చేసారు.

ఎక్కడో ఒకరిద్దరు నిర్మాతలు జాక్ పాట్ కొట్టొచ్చు. కానీ వాళ్లని చూసి వందమంది వరకు ప్రభావితం అయిపోయి నష్టాలు మూట కట్టుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది ఇండస్ట్రీ గురించి, దాని మంచి చెడ్డల గురించి తెలియక నష్టపోతున్నవారే. ఇక్కడి కట్టుబాట్లు, మహా ముదర్లు, దేశ, విదేశీ ముదుర్లు, ఎవడి అవకాశం వస్తే, వాడు లాగేసే వైనం తెలియకే మునిగిపోతున్నారు. విదేశాల్లో కాస్తో కూస్తో డబ్బులు సంపాదించిన వారు కూడా ఇక్కడకు వచ్చి టాలీవుడ్ లో పెట్టుబడులు పెట్టి, తమ హార్డ్ ఎర్న్ డ్ మనీని కోల్పోతున్నారు.

రెండేళ్ల క్రితం ఎవరు చెప్పినా వినకుండా అమెరికా నుంచి టాలీవుడ్ లో ఓ చిన్న సినిమాకు పెట్టుబడిపెట్టాడో ఎన్నారై వ్యాపార వేత్త. ఆ సినిమా ఈనాటికి ఇంకా అతీగతీ లేకుండా వుంది. అగ్రనిర్మాణ సంస్థల్లో ఒకటి అనుకున్న ఓ సంస్థ నిర్మాత కేవలం రెండు సినిమాలతో పాతిక కోట్ల వరకు నష్టాలను మూటకట్టుకున్నారు. అద్భుతం, సూపర్ డూపర్ హిట్ అనుకున్న నిర్మాత, ఓ స్టూడియోకి డిఐ చార్జెస్ కూడా కట్టలేకపోయారు. ఓ టాప్ హీరో, ఆయన సోదరుడు, ప్రెండ్స్ కలిసి నిర్మాణం ప్రారంభించి మంచి పేరు తెచ్చుకోవడం చూసి, వాళ్ల ఫ్రెండ్స్ కూడా అలాగే రంగంలోకి దిగారు. ఫస్ట్ సినిమా చేసారు. ‘మంచి’ సినిమానే అనిపించుకున్నారు. కానీ మళ్లీ సినిమా చేయాలంటే చేతిలో పైసలు లేకుండా చేసుకున్నారు.

ఓ సినిమా కొన్న డిస్టిబ్యూటర్ లాస్ అయ్యాడనుకుందాం. మరెవరో సినిమా తీస్తే, దాని హక్కులు తీసుకుని, కాస్త ఎగ్గొట్టడం. అదేంటంటే ముందు సినిమాలో లాస్ అయ్యాను అని బదులివ్వడం. ఆ సినిమా లాస్ కు మాకు ఏం సంబంధం అంటే సమాధానం వుండదు. థియేటర్ల వాళ్లకు టైమ్ వస్తే వాళ్లు, డిస్ట్రిబ్యూటర్ కు కుదరినపుడు ఆయన, ఇలా ఎవరికి వారు ఎప్పుడు అవకాశం వుంటే అప్పుడు నొక్కేయడమే. అంతే కానీ, ఏ సినిమా లెక్కలు ఆ సినిమాకు తేలవు.

బడా నిర్మాత, పెద్ద నిర్మాత ఇలా అనుకోవడం తప్ప, చాలా మంది పెద్ద నిర్మాతలకు ఎన్ని సమస్యలో వారికే తెలుసు. వాళ్లను ఇన్సిపిరేషన్ గా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చి బలైపోయేవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే వుంది. కొత్తవారు, కాస్త ఆసక్తి వున్నవారు, కనిపిస్తే చాలు, ఓవర్ సీస్ ఇంత వస్తుంది. శాటిలైట్ సరే సరి, మూడు తెలుగు ఏరియాలు ఇంత..టోటల్ గా ఇంత మిగిలిపోతుంది అంటూ కళ్ల ముందు సినిమా చూపించేసే జనాలు చాలా మంది వున్నారు. ఆ సినిమా చూసి, సినిమా తీయాలని రంగంలోకి దిగిపోయేవారికి అసలు సిసలు విషాదాంత చిత్రం చివర్న కనిపిస్తుంది.

వీళ్లందరి కథలు తెలుసుకుంటూ వుంటే, అసలు ఈ నిర్మాతలు ఏం బావుకుంటున్నారు అనిపిస్తుంది. వీటన్నింటికి తోడు ఇన్ని కోట్ల షేర్..ఇంత మేరకు లాభాలు అన్న వార్తలు చూసి ఇన్ కమ్ టాక్స్ నోటీసులు రెడీ అయిపోతాయి. వాళ్లందరికీ అసలు లెక్కలు చూపించి భోరుమనడం మినహా చేసేదేమీ వుండదు. ఫ్యాన్స్ మాత్రం మా హీరో రికార్డు..మా హీరో రికార్డు అని గుండెలు చరుచుకుంటుంటే, అసలు నిజం తెలిసిన నిర్మాత మాత్రం ఎవరు చూడకుండా గుండెలు బాదుకుంటూ వుంటాడు.

ఏమిటో టాలీవుడ్ మాయా చిత్రం?

ఆర్వీ

Show comments

Related Stories :