పే..ద్ద.. చేప..: ఎంసెట్‌ దొంగలు ఎవరు.?

ఎంసెట్‌ లీకేజీ అంటే ఆషామాషీ కాదు. గతంలో జరిగిన తంతే అయినా, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఇటీవలి కాలంలో ఎంసెట్‌ పరీక్షల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తోంటే, అసలు ఈ ప్రశ్నాపత్రం ఎలా లీకయ్యింది.? ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంవమవుతున్న అతి కీలకమైన ప్రశ్న. 

ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి పేపర్‌ లీక్‌ అయ్యిందంటూ వస్తోన్న ఊహాగానాల్ని పూర్తిగా కాదనలేంగానీ, అంత తేలిగ్గా ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి పేపర్‌ ఎలా లీకవుతుంది.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. 'పెద్దల సహకారం' లేకుండా ఇంత పెద్ద కుంభకోణాలు జరుగుతాయంటే నమ్మేంత వెర్రి వెంగళప్పలు ఎవరూ లేరిక్కడ. కాసులు వెదజల్లాలేగానీ, మార్కెట్‌లో మెడిసిన్‌ సీట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుతుపోతున్నాయన్నది కాదనలేని వాస్తవం. 

60 లక్షలు డౌన్‌ పేమెంట్‌.. ఆ తర్వాత 11 నుంచి 15 లక్షలు ఏడాదికి చెల్లిస్తే ఎంసెట్‌లో ర్యాంక్‌తో సంబంధం లేకుండా, మార్కెట్‌లో మెడిసిన్‌ సీటు దొరికేస్తుంది. ఇది ఓపెన్‌ సీక్రెట్‌. ఎన్నారై కేటగిరీ అనీ ఇంకోటనీ ఏవేవో పేర్లు పెట్టి మెడికల్‌ కాలేజీలు సీట్లు అమ్మేసుకుంటున్నాయి. ప్రభుత్వ పెద్దలకీ వీటిల్లో వాటాలుంటున్నాయి. వాటాల్లేకుండా ఇంత బహిరంగంగా మార్కెట్‌లో మెడికల్‌ సీట్లు ఎలా అమ్మేయగలుగుతారు.? 

ఈ సీట్ల అమ్మకంతోపాటు, లీకేజీ కుతంత్రాలు కూడా 'సైమల్టేనియస్‌'గా చాలా కాలం నుండే జరుగుతున్నాయి. అయితే, చాలా సందర్భాల్లో 'లీకేజీ ఉత్తదే' అని తేలుతోంది. ఈసారి వ్యవహారం వేరు. విద్యార్థులకే అనుమానం వచ్చింది. తోటి విద్యార్థులకి కొద్ది రోజుల క్రితమే ఏపీ ఎంసెట్‌లో వేలల్లో ర్యాంకులు వచ్చి, ఇప్పుడు వందల్లో ర్యాంకులు రావడంతో మెరిట్‌ స్టూడెంట్స్‌ షాక్‌కి గురయ్యారు. అక్కడ మొదలయ్యింది అసలు కథ. 

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక రెండు ఎంసెట్‌లు ఇరు రాష్ట్రాలూ విడివిడిగా నిర్వహిస్తుండడంతోనే ఆయా విద్యార్థుల బండారం తేలిగ్గా బయటపడిందన్న వాదనా లేకపోలేదు. కారణం ఏదైతేనేం, దొంగలు దాదాపుగా దొరికినట్లే. కానీ, చిన్న చేపలే దొరుకుతాయి ఇలాంటి కుంభకోణాల్లో. పెద్ద చేపలు మాత్రం యధావిధిగా తప్పించుకుంటాయి. కానీ, ఇంకోసారి పరీక్ష రాయాల్సి రావడంతో విద్యార్థులు 'అసలు పెద్ద చేప కథ తేల్చకుండా మా భవిష్యత్తుని నాశనం చెయ్యడమేంటి.?' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆవేదనలోనూ అర్థం లేకపోలేదు. 

ఇంతకీ ఆ పెద్ద చేప ప్రభుత్వంలో వుందా.? లేదంటే ఏదన్నా రాజకీయ పార్టీలో వుందా.? మెడికల్‌ కాలేజీల్ని నడుపుతున్న ఓ 'పెద్ద చేప' ఈ మొత్తం బాగోతానికి సూత్రధారి అనీ, అలాగే ప్రభుత్వం మరో పెద్ద చేప ఈ కుంభకోణానికి వెన్నుదన్నుగా నిలిచిందనీ విన్పిస్తోన్న ఊహాగానాలపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Show comments