జగన్ అంత శ్రద్ధ చంద్రబాబు చూపించరా?

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలు కాబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు కూడా తమ తమ ఎంపీలను ఈ సమావేశాలకు సిద్ధం చేస్తున్నాయి. పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరు గురించి తమతమ ఎంపీలకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, వైకాపా అధినేత జగన్ దిశానిర్దేశం చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటులో గళం విప్పవలసిన అంశాల గురించి ఎంపీలకు సూచనలు చేసిన తీరును బట్టి.. జగన్ కొంత ఎడ్వాంటేజీ పొజిషన్ లో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా.. వారి చేతలను ఏ రకంగానూ ప్రశ్నించలేని స్థితిలో ఉన్న తెలుగుదేశం.. సమావేశాల గురించి ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ.. అంతిమంగా సభలో మౌనపాత్రను పోషిస్తున్న దాఖలాలే ఎక్కువ. ఈసారి  కూడా అలాంటి సమస్యే మరొకటి రిపీట్ కాబోతున్నది.

వైకాపా ఎంపీలు ప్రతిసారీ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం గురించి గళం విప్పుతూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ విషయంలో హోదా అవసరం లేదు అని తామే తేల్చేసిన తెలుగుదేశం ఎంపీలు.. వేరే మార్గంలేక వెనకబడ్డారు. అదే క్రమంలో ఈ సమావేశాల్లో కూడా జీఎస్టీకి సంబంధించి ప్రజల కష్టాలను ప్రస్తావించడంలో జగన్ దళానికి అలాంటి ఎడ్వాంటేజీ కనిపిస్తోంది.

వైఎస్ జగన్ తన పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించినప్పుడు.. ఏపీలో కీలక సమస్యల్లో ఒకటిగా ఉన్న చేనేత పరిశ్రమ గురించి మాట్లాడారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ పన్ను విధించకుండా మినహాయింపు ఇవ్వాలంటూ కేంద్రం మీద ఒత్తిడి తేవడం గురించి ఎంపీలకు సూచించారు. ఇప్పటికే ఈ విషయం కేంద్రం పరిశీలనలో ఉంది. నిజానికి స్వదేశీ ఉత్పత్తుల మీద జనంలో మక్కువ పెంచడం అనేది మోడీ సర్కారు లక్ష్యం అయితే గనుక.. ఇలాంటి నిర్ణయాలు అందుకు దోహదం చేస్తాయి కూడా! 

అయితే జీఎస్టీ గురించి కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎలాంటి సూచన చేసే ఉద్దేశం పాలకపక్షం తెలుగుదేశానికి లేదు. ఆ రకంగా కేవలం రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించే అంశాలను మాట్లాడే విషయంలో మాత్రమే కాకుండా, చేనేత పరిశ్రమకు జీఎస్టీ నుంచి మినహాయింపు సాధించే అంశంతో కలిపి.. జగన్.. తెలుగుదేశం కంటె పైచేయి సాధించే అవకాశం ఏర్పడింది. నిజంగానే వైకాపా ఎంపీలు ఇప్పటికే కేంద్రం పరిశీలనలో ఉన్న ఈ అంశంపై గట్టిగాపోరాడి.. సత్ఫలితాన్ని సాధిస్తే గనుక.. చేనేత వర్గంలో వైకాపా ఇమేజి రెట్టింపు అవుంతుందని, ఫలితం ఎలా ఉన్నా.. తమ సమస్యలను పార్లమెంటులో వినిపించారనే గుర్తింపు ఆ పార్టీకి దక్కుతుందని పలువురు భావిస్తున్నారు.

Show comments