అద్భుతాలేమీ జరిగిపోలేదు.. అరాచకాలు సహా.. అంతా అనుకున్నట్టే అయ్యింది.! ఎవరనుకున్నట్టుగా.? ఇంకెవరు, బెంగళూరు జైల్లో కూర్చున్న 'చిన్నమ్మ' స్కెచ్ వేసినట్లుగా.! మీకేమన్నా డౌటుందా.? అయితే, తమిళనాడు అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు సంబంధించిన వీడియోలపై ఓ లుక్కేస్కోండి.
ఎమ్మెల్యేలు తమ స్థాయిని మరిచి, కొట్టుకున్నారు. ప్రతిపక్ష నేతను మార్షల్స్ ఎత్తి అవతల పారేశారు. అబ్బో, చెప్పుకుంటే ఇదేదో ఊర మాస్ సినిమాలోని ఇంకా ఊర మాస్ ఫైట్ అన్పించకమానదు. ఇంత గందరగోళం నడుమ కూడా బల పరీక్ష జరిగింది. ఎలాగనుకున్నారు.? ప్రతిపక్షాన్ని బయటకు పంపించేశాక బల పరీక్ష జరగడం విశేషమిక్కడ. ప్రతిపక్షం లేకుండా బల పరీక్ష ఏంటి.? అనడగొద్దు.. అదంతే.
ప్రతిపక్షాన్ని బయటకు తోసేసిన తర్వాత, బల పరీక్ష మొదలెట్టేసి, క్షణాల్లోనే 'పళనిస్వామి విజేత' అని ప్రకటించేశారు అక్కడి స్పీకర్. ఈ మాత్రం దానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలెందుకు దండగ.? అన్న డౌట్ మీకొస్తే, అది మీ తప్పు కానే కాదు. అయ్యిందేదో అయిపోయింది.. గడచిన పది పదిహేను రోజులుగా దేశంలో తమిళ రాజకీయాలే హాట్ టాపిక్. అంతలా అక్కడ ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది.. రాజ్యాంగం అపహాస్యం పాలయ్యింది.. ఇదిగో, ఇప్పుడిలా చట్ట సభల తీరు హాస్యాస్పదంగా మారింది.!
ఎలాగైతేనేం, మరో అంకం ముగిసింది. పన్నీర్ సెల్వం 11 మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టారు. 122 మంది ఎమ్మెల్యేల బలంతో విశ్వాస పరీక్షలో పళనిస్వామి నెగ్గారు. కాదు కాదు, పన్నీర్ సెల్వంపై శశికళ విజయం సాధించారు. ఓడి గెలవడమంటే ఇదే మరి. ఈ క్రమంలో ప్రజాస్వామ్యం అపహాస్యం కావొచ్చుగాక, ఇంకేమైనా కావొచ్చుగాక. గెలుపు గెలుపే కదా.!
ఇక్కడితో 'సినిమా' ముగిసిందనుకోవాలా.? మళ్ళీ కొత్త ట్విస్ట్ తెరపైకొస్తుందా.? ముగిసిందనే ఆశిద్దాం.