బాబు ఊతపదం 'ప్రపంచంలోనే....'..!

ప్రతి మనిషికి ఒకటో రెండో ఊతపదాలుంటాయి. ఆ పదాలు లేకుండా వారు మాట్లాడలేరు. సామాన్యులు మాట్లాడే ఊత పదాలు అతిశయోక్తిగా, ఓవరాక్షన్‌ చేస్తున్నట్లుగా అనిపించవు. తమ సహజ ధోరణిలో పలుకుతుంటారు. రాజకీయ నాయకులకూ ఊతపదాలుంటాయి. అవి కొందరికి సహజంగా మాట్లాడుతున్నప్పుడు వచ్చేస్తాయి. కొందరు మాత్రం ఉద్దేశపూర్వకంగా మాట్లాడతారు. అలా మాట్లాడటానికి కారణం ప్రజలను ఆకట్టుకోవడానికే. అతిశయోక్తిగా ఊతపదాన్ని ఉపయోగించినప్పుడు అది ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

అసహజంగా ఉండి చిరాకు పడుతుంది. ఇలా అసహజంగా మాట్లాడే నాయకుల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరు. అధికారులతో, నాయకులతో నిర్వహించే సమావేశాల్లో, బహిరంగ సభల్లో చెప్పిందే చెప్పి గంటల తరబడి ఊదరగొడుతున్న చంద్రబాబుకు ఇష్టమైన ఊతపదం 'ప్రపంచంలోనే' అనేది. ఇది సహజంగా ఆయన మాటల్లో దొర్లేది కాదు. ఇది రాజకీయ ఊతపదమని చెప్పుకోవచ్చు. ప్రజలను ఇంప్రెస్‌ చేసేందుకు వాడుతుంటారు.

తాను (ప్రభుత్వం) ఏ పని చేసినా ఇది ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదని చెబుతుంటారు. ప్రపంచంలోనే అతి గొప్ప కార్యక్రమమని, ప్రపంచంలోనే అద్భుతమని అంటుంటారు. గత మూడేళ్లుగా మాటా మాట్లాడితే 'ప్రపంచంలోనే' అనడం బాగా అలవాటైపోయింది. తాను చేస్తున్న ప్రతి పని గొప్పదని, అద్భుతమని, ఇటువంటి పని ఎవ్వరూ చేయలేదని చంద్రబాబు చెప్పుకుంటున్నారుగాని వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. అయినా ఆయన పట్టించుకోకుండా తన ధోరణిలో తాను చెప్పుకుపోతుంటారు.

ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నవనిర్మాణ దీక్ష పేరుతో సభలు, ర్యాలీలు నిర్వహించి సుదీర్ఘ ప్రసంగాలతో ప్రజలకు శిక్ష విధించారు. ఆయన ప్రసంగాలు వినలేక జనం పారిపోతుంటే పోలీసులు, 'పచ్చ' నాయకులు బలవంతంగా కూర్చోబెట్టి వినిపించారు. ఇక బాబు అతిశయోక్తులతో గొప్పలు చెప్పుకుంటూ గోరంతలను కొండంతలు చేసి ప్రజలకు అందమైన 'కతలు' వినిపించారు. చేసిన పనులతోపాటు చేయని పనులూ చెప్పుకున్నారు. ఆయన ప్రసంగాలు వింటే చంద్రబాబు ధర్మ ప్రభువని, ఆయన చల్లని పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని అనుకుంటారు. అలా పిక్చరైజ్‌ చేయడంలో బాబు సిద్ధహస్తుడు.

2050 నాటికి ఏపీని ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఆర్జించే రాష్ట్రంగా చేస్తానన్నారు. గత మూడేళ్లలో రాష్ట్రం తాను అనుకున్నదానికంటే ఎక్కువగా అభివృద్ధి చెందడంతో చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ అభివృద్ధి 'రాజుగారి వస్త్రాలు' వంటివి. ఆయనకు తప్ప ఎవ్వరికీ కనబడదు. రాష్ట్రంలో ఫైబర్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఫోన్‌, ఇంటర్నెట్‌, టీవీ సౌకర్యం కల్పించబోతున్నామని, ఇంత చౌకగా ప్రపంచంలోనే ఎక్కడా ఇవ్వడంలేదని చెప్పారు.

ఇక రాజధాని అమరావతి నిర్మాణం గురించి చెప్పేదేముంది? ప్రపంచంలోనే అద్భుత రాజధాని అని ఇప్పటికి వేలసార్లు చెప్పారు. ప్రపంచంలోని ఐదు ప్రముఖ రాజధాని నగరాల్లో అమరావతి ఒకటని అన్నారు. అమరావతి గురించి బాబు చెప్పిన 'కథలు' రాస్తే ఓ పెద్ద పుస్తకం అవుతుంది. కాని వాస్తవం ఏమిటి? ఇప్పటివరకు ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఇక పోలవరం ప్రాజెక్టు గురించి కూడా కొండంతలు చేసి చెప్పడం బాబుకు అలవాటు. 'భవిష్యత్తులో భారతదేశంలో పోలవరం అతి పెద్ద ప్రాజెక్టు. ఇలాంటిది ఎక్కడా రాదు'..అని కాఫర్‌ డ్యామ్‌ శంకుస్థాపన సందర్భంగా చెప్పారు.

పోలవరం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు అని, చైనాలోని త్రీగోర్జెస్‌ దీనిముందు దిగదుడుపని చెప్పలేదు ఎందుకో....! బాబు ఏ అంశం గురించి మాట్లాడినా అతిశయోక్తులు, వర్ణనలు ఎక్కువ. విషయం సూటిగా చెప్పకుండా చిలవలు పలవలు చేస్తారు. ఈమధ్య కొన్ని విషయాలు పదేపదే చెబుతున్నారు. ఆయన కనిపెట్టిన కొత్త తారకమంత్రం 'ప్రజలే ముందు' (పీపుల్‌ ఫస్ట్‌).

అధికారులకు, నాయకులకు ఇది తారకమంత్రమని, దీన్ని మర్చిపోవద్దని చెప్పారు. ఇదేం తారకమంత్రం? ప్రజలే ముందు అని కొత్తగా చెప్పడమేమిటి? ప్రజాస్వామ్యంలో ప్రజలు ముందు కాకుండా వెనక ఉంటారా? ప్రభుత్వాలు పనిచేసేది ప్రజల కోసమే కదా. మళ్లీ ప్రజలే ముందు అంటూ నినాదమెందుకు? ఇక మరోటి... అ-అంటే అమ్మ, ఆ-అంటే అంధ్రప్రదేశ్‌, అ-అంటే అమరావతి, ఆ-అంటే ఆదాయం చిన్న పిల్లలకు చెప్పాలంటున్నారు బాబు. ఇది బాబు రచించిన తెలుగువాచకమన్నమాట. చేయాల్సిన పనులు సరిగా చేస్తే చాలు. ఈ కొసరు పనులెందుకు?

Show comments