నానా.. హీ ఈజ్‌ వెరీ వెరీ స్పెషల్‌

వెండితెరపై విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు. బాలీవుడ్‌లో నానా పటేకర్‌కి ప్రత్యేకమైన స్థానం వుంది. హీరోలతో సమానంగా ఓ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ స్టార్‌డమ్‌ సంపాదించిన అతి కొద్దిమందిలో నానా పటేకర్‌ ఒకడు. నానా పటేకర్‌ సినిమాల్లో చేసిన పాత్రలు కాస్త డిఫరెంట్‌గా వుండేవి. క్రూరత్వం చూపించేవాడు.. అంతలోనే, ఆలోచింపజేసేవాడు. నానా పటేకర్‌ కోసమే, కొత్త కొత్త పాత్రల్ని సృష్టించేవారు దర్శకులు. 

ఇప్పుడిదంతా ఎందుకంటే, నానా పటేకర్‌ కేవలం నటుడు మాత్రమే కాదు.. సామాజిక బాధ్యత తెలిసిన వ్యక్తి కూడా. మొన్నీమధ్యనే, అసహనం మీదా, ఇతరత్రా అంశాల మీదా బాలీవుడ్‌ సెలబ్రిటీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, 'మా మాటలకు విలువ లేదు.. మేం తెరపై నటిస్తాం, అంతకు మించి మాకు ఎలాంటి సామాజిక బాధ్యతా వుండదు..' అంటూ ఆయా సెలబ్రిటీల మీద సెటైర్లు వేసేశాడు. 

తాజాగా, నానా పటేకర్‌ జమ్మూకాశ్మీర్‌లో పర్యటించాడు. అక్కడి యువతకి చక్కటి సందేశమిచ్చాడు. రాజకీయ నాయకులు కూడా చేయలేని పనిని నానా పటేకర్‌ చేశాడు. 'చదువుకోండి.. రాళ్ళు పట్టుకుని మీరు సాధించేదేమీ లేదు. ఈ దేశంలో పౌరులమని మీరు భావించండి.. అన్నీ సర్దుకుంటాయి..' అంటూ యువతను ఉద్దేశించి నానా పటేకర్‌ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. 

నానా పటేకర్‌ మాటల్ని ఎంతమంది లెక్కల్లోకి తీసుకుంటారు.? అనే సంగతి పక్కన పెడితే, కాశ్మీర్‌కి వెళ్ళి యువతకు మంచి మాటలు చెప్పే ధైర్యమే ఎవరూ చెయ్యరు. కానీ, ఆ సాహసం నానా పటేకర్‌ చేశాడు. అంతేనా, సైన్యం సేవల్ని కొనియాడాడు. వారిలోని ఓర్పుకి సెల్యూట్‌ చేశాడు. దేశమంతా పండగులు చేసుకుంటున్నా, దేశ రక్షణే తమకు నిజమైన పండుగ అని భావించే సైనికులకు సెల్యూట్‌ చేయడం కన్నా గొప్ప విషయం ఏముంటుందని అన్నాడు. సైన్యానికి నేను స్ఫూర్తి కలిగించే మాటలు చెప్పడమేంటి.? వాళ్ళూ నాకు స్ఫూర్తినిచ్చారు. దేశంలో ప్రతి ఒక్కరూ సైనికుల్లా ఆలోచిస్తే, దేశం బాగుపడుతుందన్నాడు నానా పటేకర్‌. నిజమే కదా.! అందుకే, నానా పటేకర్‌ వెరీ వెరీ స్పెషల్‌.

Show comments