అశ్విన్‌ గూగ్లీ: 234 కొత్త ఉద్యోగాలు.!

తమిళనాడులో కొత్త ముఖ్యమంత్రిగా జయలలిత నిచ్చెలి శశికళ.. 

వారం రోజుల్లో జయలలిత అక్రమాస్తుల కేసులో తీర్పు... 

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం రాజీనామా ఆమోదం... 

తమిళనాడు రాజకీయాల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. 'ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంలేదు..' అని సన్నిహితులకు తెగేసి చెప్పిన పన్నీర్‌ సెల్వం, శశికళ ఆగ్రహం వ్యక్తం చేసేసరికి, కిమ్మనకుండా ఆమె వద్దకు వెళ్ళి, రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. మీడియాని తీవ్ర గందరగోళంలోకి నెట్టేసి, శశికళ తాను చెయ్యదలచుకున్నది చేసేశారు.. అనుకున్నది సాధించేశారు కూడా.! 

కానీ, అంతలోనే పెద్ద షాక్‌. జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీం తీర్పు వారం రోజుల్లో రానుంది. ఈ కేసులో శశికళపైనా తీవ్రమైన ఆరోపణలే వున్నాయి. జయలలిత ఇప్పుడు జీవించి లేరుగనుక, మొత్తం కేసు ఇప్పుడు శశికళ నెత్తిన పడ్డట్టే. తీర్పు గనుక, శశికళకు వ్యతిరేకంగా వస్తే అంతే సంగతులు. ఫిబ్రవరి 9వ తేదీన శశికళ ముఖ్యమంత్రి అవుతారట.. 13వ తేదీ తర్వాత ఏ క్షణాన అయినా సుప్రీం తీర్పు రావొచ్చు. ఒకవేళ శశికళ దోషి అని తేలితే, జస్ట్‌ నాలుగైదు రోజులు మాత్రమే ముఖ్యమంత్రి పదవిలో వుంటారు శశికళ. 

ఈ గందరగోళం ఇలా వుంటే, క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సోషల్‌ మీడియాలో ఆసక్తికరమైన కామెంట్‌ చేశాడు. 234 కొత్త ఉద్యోగాలకు సిద్ధంగా వుండాలంటూ యువతకు పిలుపునిచ్చాడాయన. 234 నెంబర్‌ ఏంటో తెలుసా.? తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య. అంటే, ప్రభుత్వం కుప్పకూలిపోతుందనీ.. ఎన్నికలు త్వరలో జరగనున్నాయనే కదా అర్థం.! అశ్విన్‌ గూగ్లీ దెబ్బ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. 

అన్నట్టు, శశికళ వ్యతిరేకులు తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు షురూ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో పెద్ద యుద్థమే నడుస్తోంది.. శశికళకు వ్యతిరేకంగా. కొందరు పాటల్ని రూపొందించి నిరసన వ్యక్తం చేస్తుంటే, ఇంకొందరు వీడియోలతో శశికళపై పొలిటికల్‌ వార్‌ కొనసాగిస్తున్నారు. పరిస్థితి చూస్తోంటే, ముందు ముందు శశికళ భవిష్యత్‌ అగమ్యగోచరంలా తయారయ్యేలా వుంది.

Show comments