'పచ్చ' నేతల అవినీతి కాషాయాన్ని ముంచుతుందా?

ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షాలుగా ఉండి, అధికారం కూడా పంచుకుంటున్న టీడీపీ-బీజేపీ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయా? ఈ ప్రశ్నకు ఇప్పటివరకు సరైన సమాధానం రావడంలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, సీఎం చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు చేస్తున్న ప్రకటనలు గమనించినా, ఇరు పార్టీల నాయకుల్లో కొందరి వ్యాఖ్యలు, అభిప్రాయాలు పరిశీలించినా ఈ పొత్తు కచ్చితంగా కొనసాగుతుందా? అనే అనుమానం కలుగుతోంది.

బీజేపీతో కలిసి పోటీ చేయాలని చంద్రబాబుకు కోరిక ఉన్నట్లు కొందరు నాయకులు చెబుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ప్రధాని మోదీ ఇమేజ్‌. టీడీపీ పార్టీపై, పాలనపై ప్రజా వ్యతిరేకత ఉండటం, ప్రధాన ప్రతిపక్షం బలంగా ఉండటంతో గత ఎన్నికల్లో మాదిరిగా గెలుపు సులువు కాదనే అభిప్రాయం ఉంది. వాస్తవానికి గత ఎన్నికల్లోనూ ఓట్ల రీత్యా చూస్తే పాలక-ప్రతిపక్ష  పార్టీల మధ్య పెద్దగా తేడా లేదు. వ్యత్యాసం ఐదు లక్షల ఓట్లు మాత్రమే. రెండు పార్టీలూ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదు. టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉండగా, బీజేపీ బలం పుంజుకోలేదు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాల్సివున్నా ఆ పని చేస్తే బీజేపీకి గట్టి దెబ్బ తగులుతుందని ఆ పార్టీ నాయకులు భయపడుతున్నారని సమాచారం. అమిత్‌ షా కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారట. ఇందుకు కారణం టీడీపీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల అవినీతి. వారిపై ఉన్న ప్రజా వ్యతిరేకత. కలిసి పోటీ చేస్తే ఆ ప్రభావం తమ పార్టీపై కూడా పడుతుందని బీజేపీ నాయకులు భయపడుతున్నారు. కొంతకాలం క్రితం అమిత్‌ షా ఏపీలో పర్యటించారు.

ఆయన పార్టీని బలోపేతం చేయడంకంటే టీడీపీ పరిస్థితిని అధ్యయనం చేయడమే లక్ష్యంగా వచ్చారని సమాచారం. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల అవినీతి ఏమిటో, మంత్రుల పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి వచ్చారట. రాష్ట్రంలో పాలన, పార్టీ నాయకులపై అధ్యయం చేసిన అమిత్‌ షా నియమించుకున్న బృందం ఆయనకు ఓ నివేదిక సమర్పించింది. దాని ప్రకారం...37 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలపై తీవ్రమైన ఆరోపణలు (అక్రమంగా ఇసుక తవ్వకం, రవాణా, అక్రమంగా గనుల తవ్వకం, భూముల కబ్జా వగైరా) ఉన్నాయి.

చాలా నియోజకవర్గాల్లో 'పచ్చ' ఎమ్మెల్యేలపై ప్రజావ్యతిరేకత ఎక్కువగా ఉంది. వారు ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని తెలిసింది. 18 మంది ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా తమ నియోజకవర్గాల్లో బీజేపీని దూరం పెట్టారు. అభివృద్ధి పనుల్లో వారి భాగస్వామ్యం, ప్రమేయం లేకుండా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీతో కలిసి పోటీ చేస్తే ఎంతవరకు ప్రయోజనం? అనే విషయంలో బీజేపీ నాయకులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

ఈమధ్య అమిత్‌ షా వచ్చి వెళ్లిన తరువాత  రెండు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. కేశినేని నాని వంటివారు బీజేపీతో పొత్తు లేకపోయుంటే టీడీపీకీ ఎక్కువ సీట్లు వచ్చేవన్నారు. అప్పుడు చంద్రబాబు తమ్ముళ్లను మందలించి బీజేపీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించారు. పొత్తుపై ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడవద్దని, తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొంతకాలం క్రితం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పొత్తులపై ఇప్పుడే మాట్లాడటం అనవసరమన్నారు. కాని ఈ మధ్య రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని చెప్పారు. ఒక్కటి మాత్రం వాస్తవం.

కమలం-సైకిల్‌ మధ్య హృదయపూర్వకమైన స్నేహం లేదు. రెండు పార్టీల్లోనూ విడిపోవడానికి చాలామంది నాయకులు సుముఖంగా ఉన్నారు. కొందరు ఆ విషయం బహిరంగంగానే చెబుతున్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజుతోపాటు కాంగ్రెసు నుంచి బీజేపీలోకి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, కావూరి సాంబశివరావు మొదలైనవారంతా టీడీపీతో కలిసి పోటీ చేయొద్దని ఎప్పటినుంచో కోరుతున్నారు.

ఈమధ్య చంద్రబాబు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'పొత్తుపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. దాన్ని గురించి మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదు' అని చెపారు. 2019 వరకైతే బీజేపీతో కలిసి ప్రయాణిస్తామన్నారు. తాను మిత్ర ధర్మం పాటిస్తున్నానని అన్నారు. బాబు చెప్పినదాన్ని బట్టి 2019 ఎన్నికల్లో పొత్తు ఉండాలా? వద్దా? అనేది మళ్లీ నిర్ణయమవుతుందన్నమాట. అప్పటి రాజకీయ పరిస్థితిని బట్టి ఏం చేయాలనేది ఆలోచిస్తారు.

Show comments