ఆంధ్రప్రదేశ్‌కి మోడీ 'బిగ్‌' న్యూస్‌.?

ఆంధ్రప్రదేశ్‌కి ప్రధాని నరేంద్రమోడీ బిగ్‌ న్యూస్‌ చెప్పారు. సెంట్రల్‌ డైరెక్ట్‌ ట్యాక్స్‌ బోర్డ్‌, 2015 నుంచి ఆంధ్రప్రదేశ్‌కి పన్ను రాయితీలు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. 2020 వరకూ ఇది అమల్లో వుంటుంది. అంటే ఐదేళ్ళపాటు, ఆంధ్రప్రదేశ్‌కి పన్నుల విషయంలో కాస్త మినహాయింపు వుంటుందన్నమాట. పరిశ్రమలకు పన్ను రాయితీలు కల్పించడం ద్వారా, కొత్తగా ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యిందనే అనుకోవాలి. 

అయితే, మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు పన్ను రాయితీలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరింది. కానీ, కేంద్రం వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు మాత్రమే ఈ పన్ను రాయితీలను ప్రకటించడం గమనార్హం. వాస్తవానికి, ఈ పన్ను హామీలు విభజన చట్టం అమలుతోనే ఆంధ్రప్రదేశ్‌కి దక్కాల్సి వుంది. కానీ, దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత ప్రకటన వచ్చింది. అందునా, 2016 దాదాపు పూర్తయిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో 2015 నుంచి 2020 వరకూ.. అంటే వ్యవహారం కాస్త తేడాగానే అన్పించకమానదు. 

ఇదిలా వుంటే, పన్ను రాయితీల విషయంలో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రాజకీయ పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమ వర్గాల నుంచి కూడా భిన్నాభిప్రాయాలే వ్యక్తమవుతుండడం విశేషం. ప్రత్యేక హోదాని పక్కన పెట్టి, ప్రత్యేక ప్యాకేజీనీ అటకెక్కించి, ప్రత్యేక సాయం పేరుతో రాష్ట్ర ప్రజానీకాన్ని నిలువునా ముంచేసిన ప్రధాని నరేంద్రమోడీ.. పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలను ప్రకటించడం వెనుక ఏ మతలబూ లేదని అనుకోవడానికి వీల్లేదు. 

మరి, పరిశ్రమ వర్గాల నుంచీ, విపక్షాల నుంచీ వెల్లువెత్తుతున్న అనుమానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కవరింగ్‌ ఎలా వుంటుందో, కేంద్రానికి ఇంకోసారి థ్యాంక్స్‌ చెప్పడానికి చంద్రబాబు ఎలాంటి కారణాలు వెతుక్కుంటారో వేచి చూడాల్సిందే.

Show comments