టీడీపీలోకి బుట్టా రేణుక: అవసరమెవరిది.?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పైగా మంత్రి కూడా అయిన నారా లోకేష్‌ని వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక కలవడంతో కర్నూలు జిల్లా రాజకీయాల్లో రసవత్తరమైన చర్చ జరగడం మామూలే. ఏపీ రాజకీయాల్లో ఇదొక కీలక పరిణామంగా చెప్పుకోవాలి. 'మంత్రిగారు జిల్లాకి రావడంతో, ఎంపీ హోదాలోనే వెళ్ళి కలిశా..' అంటూ బుట్టా రేణుక చెప్పుకున్నారుగానీ, తెరవెనుక తతంగం ఏమిటి.? అన్నది చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. 

నిజానికి బుట్టా రేణుకకి తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు ఈనాటివి కావు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక అప్పట్లోనే టీడీపీలోకి జంప్‌ చేసేశారు, కానీ తిరిగి వైఎస్సార్సీపీలోకి వచ్చేశారు. 'చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది..' అన్న నోటితోనే, వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తి లేదని సెలవిచ్చారామె అప్పట్లో. కాలం గిర్రున తిరిగింది. మళ్ళీ ఇప్పుడు టీడీపీ వైపు మనసు మళ్ళింది బుట్టా రేణుకకి. 

నిజానికి, ఇక్కడ అవసరం ఇద్దరిదీ.! బుట్టా రేణుక టీడీపీలోకి వెళ్ళాలనే ప్రయత్నాలు చేయడం ఎంత నిజమో, ఆమెను ఎలాగైనా తమవైపుకు తిప్పుకోవాలని టీడీపీ గత కొంతకాలంగా ఎదురుచూస్తున్నదీ అంతే నిజం. అన్నట్టు, 'పోతే పోనీ..' అన్నట్లు వైఎస్సార్సీపీ, బుట్టా రేణుక విషయంలో లైట్‌ తీసుకోవడం కూడా వాస్తవమే. కానీ, ఎక్కడో చిన్న గందరగోళం.. అదే, గతంలో ఆమె టీడీపీలోకి వెళ్ళినట్లే వెళ్ళి వెనక్కి వచ్చేలా చేసింది. ఇప్పుడూ అదే పరిస్థితి. 

కానీ తప్పదు.. త్వరలో నంద్యాల ఉప ఎన్నిక జరగనుంది. జిల్లాలో వైఎస్సార్సీపీని దెబ్బకొట్టామని తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావించాలంటే, ఎంపీ బుట్టా రేణుకని టీడీపీలోకి తీసుకురావాల్సిందే. ఇదే, టీడీపీ వ్యూహం. బుట్టా రేణుక, టీడీపీలోకి వెళ్ళినా నంద్యాల ఉప ఎన్నికపై ఆ ప్రభావం వుండదన్నది నిర్వివాదాంశం. 

మొత్తమ్మీద, నంద్యాలలో గెలుపుకోసం అధికార పార్టీ నానా తంటాలూ పడ్తోందన్నమాట. బుట్టా రేణుక టీడీపీలోకి వెళతారా.? లేదా.? అన్నది అసలు ఇక్కడ పాయింటే కాదు.. అధికార పార్టీ తన వైఫల్యాల్ని బయటకు కన్పించనీయకుండా చేయడానికి.. ఇదిగో, ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందన్నమాట. చినబాబు కర్నూలు జిల్లాపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టడం, అది నచ్చి బుట్టా రేణుక టీడీపీలోకి వెళ్ళాలనుకోవడం.. ఇదంతా టీడీపీ ఇస్తున్న కలరింగ్‌. 

కానీ, చినబాబు ట్రాక్‌ రికార్డ్‌ వేరే వుంది. తెలంగాణలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా లోకేష్‌ నేతృత్వంలోనే టీడీపీ మట్టికరిచేసింది.. ఆఖరికి గ్రేటర్‌ ఎన్నికలతో సహా. అదే ట్రాక్‌ రికార్డ్‌ నంద్యాలలోనూ కొనసాగనుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు.

Show comments