సవతి చెల్లెళ్లతో బంధంపై హీరో కామెంట్స్!

తన పదకొండేళ్ల వయసులో తన తల్లిదండ్రులిద్దరూ విడిపోయారని.. అప్పటి నుంచి తనను అన్నింటికీ అమ్మే ముందుండి పెంచిందని.. చెప్పాడు అర్జున్ కపూర్. అలాంటి తల్లి కొన్నాళ్ల కిందట మరణించడం తన జీవితంలో అతి పెద్ద విషాదమని వివరించాడు. ఇప్పటికీ ప్రతి రోజూ ఇంటికెళ్లగానే తన తల్లి గదికి వెళ్తాను అని.. ఆమెతో తన సంభాషణ కొనసాగుతుందని ఈ హీరో తల్లితో తన అనుబంధాన్ని వివరించారు.

పైకి ప్లేబాయ్ లా, సినిమాల్లోనూ అలాగే.. ఎఫైర్లతో వార్తల్లో నిలిచే ఈ హీరో జీవితంలో మరో కోణంలో చాలా విషాదమే ఉంది. తల్లిదండ్రులు విడిపోవడంతో సంభవించినది అది. ఇరవై యేళ్ల కిందట జరిగిన ఆ పరిణామం గురించి అర్జున్ ఇప్పటికీ అదే తీవ్రతతో స్పందిస్తుండటం గమనార్హం.

బోనీ కపూర్ మొదటి భార్య తనయుడు అయిన అర్జున్ కపూర్, తన పినతల్లి శ్రీదేవి విషయంలో ఇప్పటి వరకూ ఎప్పుడూ కూడా సానుకూలంగా స్పందించింది లేదు. ఆమె తమ జీవితాలను నాశనం చేసిందనే అభిప్రాయమే పరోక్షంగా వ్యక్తం అవుతూ ఉంటుంది అర్జున్ మాటల నుంచి. కేవలం శ్రీదేవితోనే కాదు…ఆమె కూతుళ్లు అనగా తన చెల్లెళ్లు జాన్వీ, ఖుషీ లతో తనకు అస్సలు పరిచయమే లేదన్నట్టుగా మాట్లాడాడు అర్జున్.

తాము ఎప్పుడూ కలవం అని, కలిసి మాట్లాడకోవడం, సరదాగా గడపడం అస్సలు ఉండదని.. అర్జున్ కుండబద్ధలు కొట్టడం విశేషం. తమ మధ్య అన్నా చెల్లెళ్ల బంధం ఏదీ అస్సలు లేదని స్పష్టం చేశాడు. అంతా బోనీ కపూర్ సంతానమే అయినా, వీరి మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవనే విషయం ఈ విధంగా స్పష్టం అవుతోంది. విశేషం ఏమిటంటే.. అనిల్ కపూర్ తనయ, తనయులతో మాత్రం అర్జున్ కు సన్నిహిత సంబంధాలుండటం. చిన్నాన్న పిల్లలతో మాత్రం ఈ హీరో సన్నిహితంగా ఉన్నాడు.

అలాగే అర్జున్ కు సొంత చెల్లెలు ఒకరున్నారు. తల్లి లేని ఆమె బాధ్యత అంతా తనదే అని ఈ హీరో వివరించాడు. మొత్తానికి అర్జున్ కపూర్ వ్యక్తిగత జీవితంలోని బంధాలు, భావోద్వేగాలు.. సినిమాకు తీసిపోని రీతిలో ఉన్నట్టున్నాయి.

Show comments