జగన్ కు దక్కిందనే కాదు, బాబుకు దక్కలేదని కూడా!

ప్రధానమంత్రి మోడీతో ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి సమావేశం కావడంపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తోందో వేరే వివరించనక్కర్లేదు. తెలుగుదేశం పార్టీ నేతలేమో మోడీ కాళ్లు పట్టుకోవడానికే జగన్ ఆయనతో సమావేశం అయ్యాడని.. అక్కసు వెల్లగక్కితే, తెలుగుదేశం పార్టీ జాతి మీడియా ఇంకేదేదో చేసింది.. తమ అభద్రతా భావాన్ని ఏ మాత్రం దాచుకోకుండా చాటేసుకుంది. ఏదేమైనా మోడీతో జగన్ సమావేశంతో తెలుగుదేశం పార్టీ ఉలిక్కి పడింది. మరి ఇంతలా షాకవ్వడానికి కారణం ఏమిటి అంటే.. మారుతున్న రాజకీయ సమీకరణాలే అని చెప్పాలి.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి వెళ్లడం వల్ల ఉపయోగం లేదని భారతీయ జనతా పార్టీ ఒక అంచనాకు రావడంతోనే జగన్ కు ప్రాధాన్యతను పెంచుతోందని స్పష్టం అవుతోంది. మరి ఇంతకు మించిన విషయం ఏమిటంటే.. సరిగ్గా ప్రధానితో జగన్ సమావేశం కావడానికి కొన్ని రోజుల ముందు చంద్రబాబు నాయుడు పీఎంతో సమావేశం కోసం గట్టిగా ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. ఒక ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన కథనం ప్రకారం... మే రెండో తేదీ, మూడో తేదీల్లో ప్రధానితో అపాయింట్ మెంట్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు గట్టిగా ప్రయత్నించారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్రమంత్రి ఒకరు.. పీఎం నుంచి అపాయింట్ మెంట్ సాధించడానికి విఫలయత్నం చేశారు. రెండు రోజుల పాటు ప్రయత్నించినా బాబుకు ప్రధానితో అపాయింట్ మెంట్ దొరకలేదు.. అనడం కన్నా, మోడీ బాబు తరపు నుంచి వచ్చిన ఈ విన్నపాన్ని పట్టించుకోలేదు. ఇక చేసేది లేక విదేశీ పర్యటనకు వెళ్లిపోయారట చంద్రన్న. అంతలోనే షాకింగ్.. జగన్ కు పిలిచి మరీ ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ దక్కడం. హుటాహుటిన ఢిల్లీకి పిలిపించుకుని మరీ జగన్ తో సమావేశం అయ్యారు ప్రధానమంత్రి. మరి మొగుడు కొట్టినందుకు కాదు.. తోడి కోడలు నవ్వినందుకు అన్నట్టుగా.. తయారైంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఒకవైపు చంద్రబాబుకు అపాయింట్ మెంట్ దక్కలేదు, మరో వైపు జగన్ ను పిలిచి మరీ మాట్లాడారు. ఈ అక్కసే తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ వీరాభిమాన మీడియాను కుంగదీస్తోంది, ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఏదేదో చేస్తున్నారు పాపం.

Show comments