బాబుపై మోడీ కి కసి?

చంద్రబాబుపై ప్రధాని మోడీ కసి తీర్చుకుంటున్నారా? ఎన్నో ఏళ్లుగా సమయం కోసం వేచి చూసి ఇప్పుడు బాబును ఇరుకున పెడుతున్నారా?  చాలా మంది రాజకీయ నేతల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం ఇధి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీని తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురిచేసిన సంఘటన గోద్రా అల్లర్లు. ఆ సమయంలో ఆయనకు బాసటగా నిలిచింది చాలా తక్కువ మంది. చాలా మంది ఆయనను విమర్శించడమే కాకుండా కొందరయితే ఆయనను మరింత ఇరకాటంలోకి నెట్టారు. అందులో చంద్రబాబునాయుడు ఒకరు. 

ఆనాడు మోడీ తీరును తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఆయనపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసిన వారిలో ముఖ్యనేత చంద్రబాబునాయుడు. అది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఆ కసితో చంద్రబాబుపై పగ తీర్చుకుంటున్నాడన్నది అందరు అనుకుంటున్న మాట. నిజం అనేది నిప్పులాంటిది, ఎంత ఆపుకుందామన్నా ఆగదు. ఓ టీడీపీ నేత తన మనసులోని ఈ మాటను పొరపాటున బయటకు కక్కేసారు కూడా. గోద్రా అల్లర్ల సమయంలో మోడీ తీరును చంద్రబాబు తప్పుపట్టారని, ఆ కోపాన్ని ఇప్పుడు కసిగా తీర్చుకుంటున్నాడని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియా ముందే స్పష్టం చేశారు. 

పరిస్థితి చూస్తే ఇది నిజమే అన్న భావన కూడా కనిపిస్తోంది. ఎపీకి అత్యంత ముఖ్యమైన ప్రత్యేక హోదా, నిధులు, పోలవరం, విశాఖ రైల్వేజోన్ వంటి విషయంలో బాబుకు అనేక హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు. అటు కేసీఆర్ ను కూడా దగ్గరికి తీసుకుంటూ పావులు కదిపారు. ఇంతలో ఓటుకునోటు కేసు చక్కటి ఆయుధంగా దొరికింది. ఈ విషయంలో చంద్రబాబు పూర్తి స్థాయిలో దొరికిపోయాడన్నది అందరికి తెలిసిందే. దీని నుంచి బయటపడాలంటే మోడీ ఒక్కడే దిక్కు. ఈ కేసులో చంద్రబాబు ఇరుక్కోకముందు ప్రత్యేక హోదా, నిధుల విషయంలో బీజేపీ దూకుడుగా మాట్లాడలేదు. ఇస్తాం, పరిశీలిస్తున్నాం, అది ఇచ్చేందుకు సమయం పడుతుంది, అంత వరకు నిధుల సహాయం చేస్తున్నాం అంటూ సాగదీస్తూ వచ్చింది. 

నోటుకుఓటు తెరపైకి రాగానే బీజేపీ స్వరం మార్చింది. సాగదీయడం, నాన్చుడు దోరణి వీడింది, ఇక మనమేం చేసినా బాబు తోక జాడించలేరని నిర్ణయానికి వచ్చిన తరువాత డైరెక్ట్ ఎటాక్ మొదలుపెట్టింది. హోదా ఇచ్చేది లేదంది, నిధులు ఇన్నిచ్చాం, అన్నిచ్చాం అంటూ చెప్పుకు వచ్చిన బీజేపీ హటాత్తుగా నిదుల విషయంలోనూ చేతులెత్తేసింది. రాజధానికి 2500కోట్లు కంటే ఎక్కువ ఇవ్వలేం అని తెగేసి చెప్పింది. 

ఇఫ్పటి వరకు ఇన్నిచ్చాం, వీటి లెక్క చెప్పమని ప్రతిపక్షం కంటే స్ట్రాంగ్ గా ప్రశ్నించింది. పోలవరానికి ఎక్కువ సాయం చేయలేమనంది. ఇప్పుడు తాజాగా జరుగుతున్న తంతు అందరికి తెలిసిందే. ఇంత డైరెక్టుగా బీజేపీ చంద్రబాబుపై విరుచుకుపడ్డా కూడా చంద్రబాబు బీజేపీకి దూరంగా ఉండలేమని అంటున్నాడు. ప్రతిపక్షాలే కాదు, ప్రజాసంఘాలు, టీడీపీలోనూ కొందరు ముఖ్యనేతలు విడిపోయి పోరాడాలని ఒత్తిడి తెస్తున్నా.. అందుకు ససేమిరా అంటున్నాడు. దానికి కారణం చంద్రబాబు భయాలు ఆయనకు వుండొచ్చు. మోడీ తక్కువోరు కాదు.

Show comments