ఈ ధైర్యం బాబుకు ఉందా?

ఇద్దరు వ్యక్తులు స్నేహితులు. వారెలా ఉంటారు? ఒకరంటే మరొకరు భయపడతారా? ఒకరు మరొకరిని ఏమైనా అంటే, అవతలి వ్యక్తి నోరు మూసుకొని ఊరుకుంటాడా? పరస్పరం ధైర్యంగా మాట్లాడుకునేవారే నిజమైన స్నేహితులు కదా. ఇదంతా నిజజీవితంలో జరుగుతుంది. కాని రాజకీయ పార్టీల స్నేహాలు, పొత్తులు నటన మాత్రమే. ఆ స్నేహాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పడతాయి.

రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ ఏ పార్టీకి ఎక్కువ పవర్‌ ఉంటుందో, ఏ పార్టీ ఎక్కువ బలంగా ఉంటుందో ఆ పార్టీ రెండో దాన్ని కంట్రోల్‌ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ స్నేహం ఇలాగే ఉంది. నరేంద్రమోదీ ప్రధాని కాబట్టి కేంద్రంలో గొప్ప. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రంలో గొప్ప. అయినప్పటికీ పవర్‌ విషయానికి వస్తే బాబు కంటే మోదీ ఎక్కువ. ఈయన కింద ఉంటే ఆయన పైన ఉన్నాడు. మోదీ చెప్పింది బాబు వినాల్సిందే తప్ప బాబు చెప్పేది మోదీ వినడు. అందులోనూ అవసరం బాబుది. కాబట్టే ఈయన కేంద్రానికి అణిగిమణిగి ఉంటున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిస్థితి వేరు. రాజకీయంగా ఆయన బీజేపీకి ప్రత్యర్థి. అయినప్పటికీ వ్యక్తిగతంగా మోదీకి మిత్రుడిలా వ్యవహరిస్తున్నారు. ప్రధాని నిర్ణయాలను సమర్థిస్తున్నారు. సలహాలు ఇస్తున్నారు. ఆయన కూడా ఈయనతో ప్రత్యేకంగా సంప్రదిస్తున్నారు. నోట్ల రద్దు, క్యాష్‌లెస్‌ విధానం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల ఎంపిక వగైరాల విషయంలో ఇదంతా చూశాం. కేసీఆర్‌ కేంద్రానికి మిత్రుడు కాదు, శత్రువు కాదు కాబట్టి అవసరాన్నిబట్టి వ్యవహరిస్తుంటారు.

ఒక సందర్భంలో మద్దతు ఇస్తే, మరో సందర్భంలో వ్యతిరేక అభిప్రాయం కూడా ధైర్యంగా చెబుతారు. ఈ అవకాశం చంద్రబాబుకు లేదు. ఇదంతా వన్‌సైడ్‌ వ్యవహారం. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్‌ నాలుగు రోజులు అక్కడే ఉండి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను, వినతులను కేంద్రం ముందు ఉంచారు. బాబూ ఈ పనే చేశారు. ఇద్దరూ కామన్‌గా చేసిన పని 'అసెంబ్లీ సీట్లు పెంచండి' అని అడగడం. యథాప్రకారం కేంద్రం దీనిపై స్పష్టత ఇవ్వలేదు.

దీనిపై చంద్రబాబుకు ఏమనిపించిందో తెలియదుగాని కేసీఆర్‌కు అపనమ్మకం పెరిగిందని అనిపిస్తోంది. 'ఇది అయ్యేది కాదు..పొయ్యేది కాదు' అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 'అసెంబ్లీ సీట్ల పెంపు విషయం పరిశీలనలో ఉందని అంటున్నరు. ఇక పరిశీలనలోనే ఉంటదని అనుకుంట'..అన్నారు. అంటే ఇక సీట్లు పెంచబోరని చెప్పడమన్నమాట. పెంచినా పెంచకపోయినా తమకేమీ నష్టం లేదని, విభజన చట్టంలో ఉంది కాబట్టి అడిగామన్నారు.

సీట్ల పెంపు గురించి ఆత్రం కూడా లేదన్నారు. సీట్లు పెంచకున్నా టీఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుందని, బీజేపీకి అవకాశమే లేదని కేసీఆర్‌ పరోక్షంగా చెప్పారన్నమాట. ఇంత ధైర్యంగా ఏపీ సీఎం చంద్రబాబు చెప్పగలరా? సీట్లు పెంచాలనే ఆత్రం తనకు లేదన్నారంటే చంద్రబాబుకు ఉన్నట్లే అర్థం చేసుకోవాలి.

సీట్లు పెరగకపోయినా ఫిరాయింపుదారులను తాను ఏదోవిధంగా బుజ్జగించగలనని, వారితో సమస్యలు రాకుండా చూసుకోగలననే నమ్మకం కేసీఆర్‌కు ఉండొచ్చు. కాని సీట్లు పెరగకపోతే ఏపీలో ఫిరాయింపుదారులు ఎలాంటి రాజకీయాలు చేస్తారో చెప్పలేం. గతంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరు వీరంగం వేశారు. కేసులున్నవారిని బెదిరించి, లేనివారిని బుజ్జగించి బాబు దారికి తెచ్చుకున్నారు.

కాని ఎన్నికల సమయంలో ఎలా మెయింటైన్‌ చేస్తారో....! సీట్లు పెంపు గురించి కేసీఆర్‌ మరోసారి అభ్యర్థిస్తారో లేదో చెప్పలేం. కాని బాబుకు అవసరం కాబట్టి మళ్లీ అడుగుతారు. అందులోనూ టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు సీట్లు పెంచొద్దని చెబుతున్నారు. కాని ఆంధ్రా బీజేపీ నాయకులు పెంచాలంటున్నారు. సీట్లు పెంచితే తాము ఎక్కువ వాటా డిమాండ్‌ చేయొచ్చని, వచ్చే ఎన్నికల్లో ఎక్కువమంది ప్రజాప్రతినిధులను అసెంబ్లీకి, పార్లమెంటుకు పంపొచ్చని, తద్వారా బలమైన పార్టీగా ఎదగొచ్చని అనుకుంటున్నారు. అసెంబ్లీ సీట్ల పెంపుపై సస్పెన్స్‌ ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో...!

Show comments