వైకాపా బలంగా ఉండాలని బాబు కోరిక?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్ష పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఏదేదో మాట్లాడేస్తున్నారు. పొంతన, క్రమం లేకుండా ఆత్మస్తుతి చేసుకుంటున్నారు. ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన మాట్లాడే మాటల్లో ఒక్కదానికీ లాజిక్‌ లేదనిపిస్తోంది. మూడేళ్ల తరువాత విభజనపై ఎందుకు విపరీతంగా ఆక్రోశిస్తున్నారో అర్థం కావడంలేదు. కాంగ్రెసు పార్టీ మాత్రమే రాష్ట్ర విభజన చేసినట్లు, టీడీపీ, బీజేపీ పాత్ర ఆ ప్రక్రియలో ఏమాత్రం లేనట్లు మాట్లాడటం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నందువల్లనే.

రాష్ట్ర విభజన చేసి, ఏపీకి తీరని అన్యాయం చేసినందుకు కాంగ్రెసు పార్టీని గత ఎన్నికల్లో దారుణంగా శిక్షించారు. ప్రజలు తలచుకుంటే ఏమైనా చేస్తారనడానికి ఇది చక్కటి నిదర్శనం. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెసు పార్టీని అదేవిధంగా శిక్షించాలని బాబు కోరుకుంటున్నారు. అందుకే నవనిర్మాణ దీక్ష పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రజలను శక్తిమేరకు రెచ్చగొడుతున్నారు. 'చంద్రబాబే ఏపీకి దిక్కు' అని ప్రజలు భావించాలనేది ఆయన కోరిక. కాంగ్రెసుపై ప్రజాగ్రహం ఏమాత్రం తగ్గకుండా చూస్తున్నారు. 

ఇక బాబు చిత్రవిచిత్రమైన మాటలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఏపీలో రాహుల్‌ సభ పెట్టడం సహజంగానే బాబుకు ఇష్టం లేదు. అదే సమయంలో కాంగ్రెసు బలపడుతుందేమోననే భయం ఉంది. ఈమధ్య తెలంగాణలో రాహుల్‌ సభ విజయవంతం కావడంతో కాంగ్రెసు శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ఆ ఉత్సాహం తగ్గకముందే ఏపీలో సభ నిర్వహించారు. ఈ సభతో కాంగ్రెసుకు ఊపిరి ఆడుతోంది.

కాంగ్రెసు సభ పెట్టగలిగింది వైఎస్సార్‌సీపీ వల్లనేనని బాబు అన్నారు. అదెలా? రాష్ట్రంలో వైకాపా బలహీనపడిందని, అందుకే కాంగ్రెసు సభ నిర్వహించగలిగిందని సీఎం చెప్పారు. ఈ మాటలకు అర్థం ఏమిటో ఆయనకే తెలియాలి. కాంగ్రెసు ఎన్నికల్లో ఓడిపోయిందిగాని అసలు పార్టీయే లేకుండాపోలేదు కదా. అసెంబ్లీలో , రాష్ట్రం నుంచి పార్లమెంటులో ప్రాతినిథ్యం లేదు. కాని నాయకులు ఉన్నారు. కేడర్‌ ఉంది. ఆర్థిక వనరులున్నాయి. ఇన్ని ఉన్నప్పుడు సభ నిర్వహించుకోలేదా?

వైకాపా బలహీనపడింది కాబట్టి కాంగ్రెసు పుంజుకుంటోందని బాబు అభిప్రాయమైతే వైకాపా బలంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారా? వైకాపా బలంగా ఉంటే కాంగ్రెసుకు నష్టం జరుగుతుందో లేదో తెలియదుగాని టీడీపీకీ నష్టం జరుగుతుంది. బలంగా ఉన్న పార్టీ అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తుంది కదా. రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం ఎక్కుడుంది? అని ప్రశ్నించిన బాబు వైకాపా బలహీనపడుతోందని అభిప్రాయపడటమెందుకు?

ప్రతిపక్షాలు ఉండక్కర్లేదని వాదించే ముఖ్యమంత్రి కాంగ్రెసు, వైకాపా రెండూ బలహీనపడాలని కోరుకోవాలిగాని వైకాపా బలహీనపడటంవల్లనే కాంగ్రెసు పుంజుకుంటోందని చెప్పడంలో అర్థం లేదు. ఇక ఏపీ నుంచి సివిల్స్‌కు ఎంపికైనవారికి సన్మానం చేయించుకొని వారి చేత విపరీతంగా పొగిడించుకున్నారు. 'బాబు మనిషా?... యంత్రమా?' అని తాము ఆశ్యర్యపోతున్నామని వారు ఆయన పనితీరును ప్రశంసించారు.

తాను కష్టపడుతున్నానని బాబు ఆత్మస్తుతి చేసుకోవడం, బాబు విపరీతంగా కష్టపడుతున్నారని మంత్రులు, నాయకులు భజన చేయడం ఏపీలో తప్ప ఎక్కడా కనబడటంలేదు. తానొక్కడినే పరుగెడుతున్నానని తరచుగా చెప్పుకోవడం బాబుకు ఇష్టం. బాబు హయాంలో ప్రభుత్వమనేది లేదు. ఏక వ్యక్తి పాలన. రాచరికం టైపు. 

ఏనాడూ టీడీపీ ప్రభుత్వం ఫలానా పని చేసిందని బాబు చెప్పరు. ఫలానా పని నేను చేశా... ఫలాన కంపెనీ నేను తెచ్చా... నేను రోడ్లు వేశా...నేను కాలేజీలు కట్టించా... ఎప్పుడూ ఇదే స్టోరీ. దీన్నిబట్టి చూస్తే బాబుకు ఫ్యూడలిస్టు లక్షణాలు బాగా ఉన్నాయని అర్థమవుతోంది. ప్రజాస్వామ్యంలో ఫ్యూడలిస్టు పాలన కొనసాగితే అంతిమంగా నష్టపోయేది ప్రజలే.

Show comments