'అమ్మ' ఆరోగ్య పరిస్థితిపై డీఎంకే అనుమానం...!

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది అపోలో ఆస్పత్రిగాని, అన్నాడీఎంకే నాయకులుగాని, ప్రభుత్వంగాని ఇప్పటివరకు తెలియచేయకపోవడంతో ఇంటా బయట (సామాజిక మాధ్యమాల్లో) పుకార్లు, అనుమానాలు హోరెత్తిపోతున్నాయి. 'జయలలిత ఇక లేరు' అని కూడా కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. అమ్మ తుది శ్వాస విడిచారంటూ కొందరు వికీపీడియా పేజీని ఎడిట్‌ చేస్తున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక తాజా సమాచారం. డెత్‌ కాలమ్‌లో ఆమె మరణాన్ని ధ్రువీకరించారని, సెప్టెంబరు 30న కన్నుమూశారని వికీపీడియాలో రాశారట...!  ఆ తరువాత అన్నాడీఎంకే అభిమానులు ఈ సమాచారాన్ని తొలగించారని చెబుతున్నారు. 

మొత్తం మీద ఆమెకు ఏమైందో అర్థంకాని పరిస్థితి ఏర్పడటంతో రాష్ట్రం గందరగోళంగా ఉంది. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ప్రతిపక్షాలు ముఖ్యంగా డీఎంకే తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఆమె క్షేమంగా ఉన్నట్లు ఫోటోలు, వీడియోల కోసం పట్టుబడుతున్న డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి 'అసలు విషయం' తెలియచేయాలని గవర్నరుకు లేఖ రాశారు. తమిళనాడు బాధ్యతలు చూస్తున్న మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఈరోజు సాయంత్రంకల్లా చెన్నయ్‌ చేరుకుంటారని సమాచారం. ముఖ్యంగా లండన్‌ నుంచి ఒక ప్రముఖ వైద్యుడు ఆగమేఘాల మీద చెన్నయ్‌కు రావడంతో జయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు అనేకమంది భావిస్తున్నారు. 

అయినప్పటికీ అన్నాడీఎంకే నాయకులు, మంత్రులు 'అమ్మ నార్మల్‌గా ఉన్నారు. రేపోమాపో డిశ్చార్జ్‌ అవుతారు' అని చెబుతున్నారు. డీఎంకేకు ఎందుకు అనుమానం వస్తోందంటే...జయలలిత ఆస్పత్రిలోనే కావేరీ వివాదానికి సంబంధించి మంత్రులతో, అధికారులతో మాట్లాడారని, ఈ వివాదంపై ఢిల్లీలో జరిగిన సమావేశానికి వెళ్లిన బృందానికి తాను చెప్పాలనుకున్న విషయాన్ని డిక్టేట్‌ (టేప్‌ రికార్డర్‌లో) చేశారని అన్నా డీఎంకే నాయకులు చెప్పారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాలపై ఆమె అధ్యక్షతన ఆస్పత్రిలోనే సమావేశం జరిగిందన్నారు. జయ ఇంత క్షేమంగా ఉన్నప్పుడు ఆ  సమావేశాల ఫొటోలు ఎందుకు విడుదల చేయడంలేదు? అని డీఎంకే ప్రశ్నించింది.

 ఆమె నార్మల్‌గా ఉన్నట్లు ఫోటోలు విడుదల చేస్తే ప్రజల్లో ఆందోళన తగ్గుతుందని అంటున్నారు. కాని జయ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమాచారమూ బయటకు రావడంలేదు. ఇక అన్నాడీఎంకే మంత్రులకు, నాయకులకు, అధికారులకు అపోలో ఆస్పత్రే పార్టీ కార్యాలయంగా, సచివాలయంగా మారింది. ఇక సామాన్య జనం గురించి చెప్పక్కర్లేదు. రోజుల తరబడి అక్కడే ఉంటున్నారు. మీడియా ప్రతినిధులు కెమెరాలు, మైకులు పెట్టుకొని అక్కడే కూర్చున్నారు. మంత్రులు, నాయకుల్లో ఎవ్వరినీ అడిగినా 'అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. ఆమె త్వరలోనే బాధ్యతలు తీసుకుంటారు. ప్రస్తుతం ప్రభుత్వ పాలన సజావుగా సాగుతోంది' అని జవాబిస్తున్నారు. 

జయలలిత పరోక్షంలోనూ పాలన సాగించడం, నిర్ణయాలు తీసుకోవడం తమకు అనుభవమేనని ఒక అధికారి చెప్పాడు. అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని సీబీఐ కోర్టు ఆమెను దోషిగా ప్రకటించినప్పుడు కొన్ని నెలలు పదవికి దూరంగా ఉన్నారు. విధేయుడు పన్నీర్‌ శెల్వంను సీఎంగా నియమించారు. కాని ఆమె ఇంట్లో కూర్చునే పరిపాలన సాగించారు. పన్నీర్‌ శెల్వం సీఎం అయినా ఆయనతో సహా ఇతర మంత్రులు, అధికారులు పొద్దున లేస్తే ఫైళ్లు తీసుకొని జయ ఇంటికి వెళ్లేవారు. ఇప్పుడు కూడా ఆస్పత్రిలో ఉంటూ ఆమె అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నారని ఆ అధికారి చెప్పాడు. దీనిపై చెన్నయ్‌లోని అబ్జర్వర్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ సత్యమూర్తి మాట్లాడుతూ 'తమిళనాడుకు ఇది కొత్త కాదు' అని చెప్పారు. 

గతంలో ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎంజీ రామచంద్రన్‌, కరుణానిధి ఆస్పత్రిలో ఉన్నప్పుడు పరిపాలన సజావుగానే సాగిందని, వారు సచివాలయలో లేనంత మాత్రాన ఇబ్బందులు ఎదురుకాలేదని చెప్పారు. ఎంజీఆర్‌ పూర్తిగా అనారోగ్యం పాలై, ఏ పనీ చేయలేని అచేతనుడైనప్పుడు కూడా నాయకులు ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టి పరిపాలన సాగించారు. ఇప్పుడూ అలాగే చేస్తున్నారా? జయలలిత ఎన్నాళ్లు ఆస్పత్రిలో ఉంటారు? ఈ ప్రశ్నలకు జవాబు కోసం జనం ఎదురుచూస్తున్నారు. 

Show comments