బీజేపీకి దినకరన్ ఆప్తుడయ్యాడా!

మొత్తానికి తమిళ రాజకీయంలో భారతీయ జనతా పార్టీ పాత్ర మరీ దారుణంగా తయారవుతున్నట్టుగా ఉంది. ఇప్పటికే తమిళ రాజకీయంలో తలదూర్చి దాన్ని ఎటూ పరిష్కరించలేని స్థితికి చేరుకుంది కమలం పార్టీ. జయలలిత మరణంతో అన్నాడీఎంకే పై అజమాయిషీ చెలాయించడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదు.

కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. గవర్నర్ తో గేమ్ నడిపిస్తూ, వెంకయ్యనాయుడు వంటి మంత్రి జోక్యం చేసుకున్నా.. కమలం పార్టీ అన్నాడీఎంకేను ఏ విధంగానూ కంట్రోల్ చేయలేకపోయింది. పార్టీని శశికళ ఆధీనం నుంచి తప్పించేస్తే మొత్తం వ్యవహారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవచ్చని కమలం పార్టీ లెక్కేసింది. అయితే.. కథ అంతటితో అదుపులోకి రాలేదు.

శశికళ జైలుకు వెళ్లి.. దినకరన్ మరో కేసులు జైలు పాలైనా.. అన్నాడీఎంకే ను అదుపులోకి తీసుకోలేకపోయింది కమలం పార్టీ. పళనిసామి తమ మాట వింటున్నట్టుగానే కనిపిస్తున్నా, పన్నీరు సెల్వం పూర్తి గా తమ ఆదేశాలను పాటించే వాడే అయినా.. బీజేపీ అన్నాడీఎంకేను తన చెప్పుచేతల్లోకి తీసుకోలేకపోయింది. స్వయంగా అమిత్ షా రంగంలోకి దిగినా.. పని జరగలేదు.

మరి కట్ చేస్తే... జైలు నుంచి బయటకు వచ్చిన అతి తక్కువ సమయంలోనే దినకరన్ రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఏకంగా యాభై మంది ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకున్నాడు దినకరన్. మరి దినకరన్ బయటకు వస్తేనే.. కథ ఇలా ఉంది. ఇలాంటి సమయంలో శశికళ గనుక బయటకు వస్తే.. తమిళ రాజకీయాలు ఎలా మారతాయో ఊహించడం కష్టం కాదు. 

యాభై మంది ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకున్న దినకరన్ తన ఉద్దేశం పళనిసామి ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదని అంటున్నాడు. నిజమే..పళని ప్రభుత్వాన్ని పడగొడితే ఏమొస్తుంది? మహా అంటే రాష్ట్రపతి పాలన, ఆపై ఎన్నికలు. ఆ రెండింటి వల్ల దినకరన్ కు, శశికళకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ విషయం వారికి కూడా తెలిసిందే కదా. అందుకే.. వీళ్లు ఢిల్లీ చేరుకుని కొత్త గేమ్ మొదలుపెట్టినట్టుగా ఉన్నారు.

తమ సత్తా యాభై మంది ఎమ్మెల్యేలు అనే విషయాన్ని  బీజేపీ పెద్దలకు తెలియజేయడానికి దినకరన్ ఢిల్లీ బాటపట్టినట్టు ఉన్నాడు. అవతల రాష్ట్రపతి ఎన్నిక నేఫథ్యంలో కమలం పార్టీకి ఆ ఎమ్మెల్యేల బలం కూడా అవసరమే. అందుకే తన ప్రయోజనాల కోసం ఈ ఎమ్మెల్యేలతో బేరం పెట్టినట్టుగా ఉన్నాడు దినకరన్.

ప్రస్తుతానికి వారి ఓట్ల అవసరం ఉంది కాబట్టి.. కమలం పార్టీ దినకరన్ ను కూడా ఎంటర్ టైన్ చేయొచ్చు. పన్నీరు అయితే ఏంటి, పళని అయితే ఏంటి.. దినకరన్ అయితేనేం.. బీజేపీకి కావాల్సింది వారి వెనుక ఉన్న ఎమ్మెల్యేలు కదా! ఇది రాజకీయం.

Show comments