అడ్డంగా బుక్కయిపోయారు

హైద్రాబాద్‌లోని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఎఫ్‌ఎన్‌సిసి భవనానికి సంబంధించి కొత్తగా నిర్మిస్తోన్న ఓ బ్లాక్‌ కుప్పకూలిన ఘటన మొత్తంగా తెలుగు రాష్ట్రాలో కలకలం సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. జీహెచ్‌ఎంసీ అధికారులేమో, అసలు ఆ నిర్మాణానికి అనుమతి లేదంటున్నారు. ఎఫ్‌ఎన్‌సిసి తరఫున నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ, అదేమీ కొత్త భవనం కాదనీ, పోర్టికో మాత్రమేనని సెలవిచ్చారు. 

ఇంకోపక్క, ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందడంతో ఘటనను చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తెలంగాణ ప్రభుత్వానికి. కేసులు నమోదయ్యాయి ఎఫ్‌ఎన్‌సిసి మీద. ఎఫ్‌ఎన్‌సిసి ప్రెసిడెంట్‌ సహా పలువురిపై కేసులు నమోదు కావడంతో, టాలీవుడ్‌ అంతా ఇప్పుడు కలిసి కట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసేందుకు సమాయత్తమవుతుండడం గమనార్హం. 

వాస్తవానికి ఏ నిర్మాణానికి సంబంధించి అయినాసరే 'కాంట్రాక్ట్‌' ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడా అదే జరిగి వుండాలి. కానీ, ఎఫ్‌ఎన్‌సిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకోవాలి. కేవలం రెండు రోజుల్లోనే ఒకదాని తర్వాత ఇంకో స్లాబ్‌ వేయడంవల్లే ఈ ప్రమాదం సంభవించిందన్నది ఓ వాదన. కాదు కాదు, పిల్లర్స్‌ స్ట్రాంగ్‌గా లేవన్నది ఇంకో వాదన. కారణాలేవైనాసరే, కాంట్రాక్ట్‌ పొందిన సంస్థతోపాటు ఎఫ్‌ఎన్‌సీసీ కూడా ఈ ఘటనకు పూర్తిస్థాయిలో బాధ్యత వహించి తీరాల్సిందే. 

అందుకేనేమో, ఎఫ్‌ఎన్‌సిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియాని కూడా ప్రకటించేశారు టాలీవుడ్‌ పెద్దలు. మొదటి నుంచీ ఎఫ్‌ఎన్‌సిసి భవనం వివాదాస్పదంగానే వార్తల్లోకెక్కుతోంది. ఆ మాటకొస్తే, ఫిలింనగర్‌లో ప్లాట్ల కేటాయింపు చుట్టూ అనేక వివాదాలున్నాయి. సాక్షాత్తూ ఇప్పుడు అధికారంలో వున్న టీఆర్‌ఎస్‌ పార్టీనే, ఒకప్పుడు ఇక్కడ అక్రమాలపై గళమెత్తింది.  Readmore!

మరిప్పుడు, ఎఫ్‌ఎన్‌సిసి వివాదం తెలుగు సినీ పరిశ్రమ కొంప ముంచేస్తుందా.? ఆ దిశగా తెలంగాణ సర్కార్‌ అడుగులు వేయగలుగుతుందా.? మొత్తంగా ఫిలింనగర్‌ అక్రమాల్ని వెలికి తీసే సత్తా తెలంగాణ ప్రభుత్వానికి వుందా.? వేచి చూడాల్సిందే.

Show comments

Related Stories :