తుపాకులు.. తొడలు.. వర్మ..!

తీసిన సీన్లే తీస్తున్నాడు.. చెప్పిన కథలే చెబుతున్నాడు.. పెట్టిన ఫ్రేములే పెడుతున్నాడు.. ఇది రామ్ గోపాల్ వర్మపై రెగ్యులర్ గా వినిపించే కామెంట్. అప్పుడెప్పుడో తీసిన సత్య సినిమా నుంచి ఇతగాడు అవే తరహా మూస పద్ధతులు ఫాలో అవుతున్నాడని అంతా ఎగతాళి చేశారు. అందుకు తగ్గట్టే ఈమధ్య కాలంలో ఇతడి సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి కూడా.

అయితే తన మనసులో ఉన్నది ఉన్నట్టు తీయలేకపోతున్నానని, దానికి ఈ సమాజం, సెన్సార్ బోర్డ్, మాఫియా అడ్డుగా ఉన్నాయని వర్మ చాలాసార్లు చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్లకు ఈ దర్శకుడికి ఆ అవకాశం రానే వచ్చింది. తన మైండ్ లో ఉన్నది ఉన్నట్టు తీసేశాడు వర్మ. అది చూస్తే కొందరు సిగ్గుపడతారు, మరికొందరు తిట్టుకుంటారు, చాలా తక్కువ మంది మెచ్చుకుంటారు. ఎవరేమనుకున్నా లెక్కచేయని వర్మ ఈసారి తీసేశాడు. "గన్స్ అండ్ థైస్" పేరిట వెబ్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాడు. తెలుగులో చెప్పుకోవాలంటే ఈ టైటిల్ కు "తుపాకులు-తొడలు" అని అర్థం.

మాఫియా వరల్డ్ లో గన్స్ అండ్ సెక్స్ దే రాజ్యం అని చెప్పే ప్రయత్నం చేసిన వర్మ.. తన వెబ్ సిరీస్ కు సంబంధించి ఏకంగా 6 నిమిషాల ట్రయిలర్ రిలీజ్ చేశాడు. అందులో అన్నీ పచ్చి బూతులే. డైలాగ్స్ అన్నీ బూతులతో నిండిపోయాయి. సన్నివేశాల్లో భయంకరమైన హింస. వీటికి తోడు సెక్స్ సీన్లు. అవి కూడా సినిమాల్లో చూపించినలాంటి షాడో సీన్లు కాదు. ఒకటి రెండుచోట్ల అమ్మాయిల్ని నగ్నంగా చూపించేశాడు వర్మ.

మొత్తం 4 భాగాలుగా రాబోతోంది ఈ వెబ్ సిరీస్. ఒక్కో సిరీస్ లో 10 ఎపిసోడ్లు ఉంటాయని ప్రకటించాడు వర్మ. 20 ఏళ్లుగా తన మనసులో ఏదైతే అనుకున్నానో అదంతా ఈ వెబ్ సిరీస్ లో బయటపెట్టేస్తానని చెబుతున్నాడు. నిజమే ఏదైనా బయటపెట్టొచ్చు. ఎందుకంటే వెబ్ సిరీస్ కు సెన్సార్ ఫార్మాలిటీస్ ఉండవు. ఎటొచ్చి మాఫియా నుంచి బెదిరింపులు రాకుండా చూసుకుంటే చాలు.

Show comments