డ్రగ్స్ ఆరోపణలకు సంబంధించి పూరిజగన్నాథ్‌కి ఆయన కుమార్తె క్లీన్ చిట్ ఇస్తే, రవితేజకి ఆయన తల్లి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం విదితమే. తాజాగా, హీరోయిన్ ఛార్మికి ఆమె తండ్రీ దీప్ సింగ్ క్లీన్ చిట్ ఇచ్చేశాడు. కుటుంబ సభ్యులా మద్దతు పలకడంలో వింతేమీ లేదు. నిజానికి, కుటుంబ సభ్యులు ఈ స్థాయిలో ఆయా వ్యక్తులకు సపోర్ట్ ఇచ్చి తీరాల్సిందే. అయినా, ఇంట్లోవాళ్ళకు తెలిసే అన్ని పనులు జరుగుతాయా.? అలాగైతే, ప్రపంచంలో నేరాలనేవే జరగవు కదా.!
అసలు విషయానికొస్తే, ఛార్మి తండ్రి దీప్ సింగ్ ఉప్పల్ ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో తన కుమార్తె 13ఏళ్ళ వయసు నుంచీ సినీ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిందని పేర్కొన్నారాయన. కుటుంబ బాధ్యతల్ని మోస్తున్న ఛార్మి, డ్రగ్స్‌ని తీసుకోవడం అనేది జరగనే జరగదని తేల్చేశారు దీప్ సింగ్. ఛార్మిపై డ్రగ్స్ ఆరోపణలు అవాస్తవమనీ ఆయన తేల్చి పారేశారు.
ఇక, దర్శకుడు పూరిజగన్నాథ్‌కి సైతం ఛార్మి తండ్రి 'సర్టిఫికెట్' ఇచ్చేశారు. పూరిజగన్నాథ్ చాలా మంచి వ్యక్తి అనీ, ఆయనతో కలిసి పూరి కనెక్ట్స్‌ని స్థాపించిన పూరి, ఆ వ్యవహారాల్లో బిజీగా వుందని చెప్పుకొచ్చారు దీప్ సింగ్ ఉప్పల్.
ఛార్మికి ఆమె తండ్రి దీప్ సింగ్ మద్దతు ఇవ్వడం అలా వుంచితే, పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి నటించిన 'జ్యోతిలక్ష్మి' సినిమా ఫంక్షన్లలో డ్రగ్స్ డీలర్ కెల్విన్ దర్శనమిచ్చాడు. ఇదిప్పటి మాట కాదు. అయితే, అప్పట్లో అతనే డ్రగ్స్ డీలర్ అని సామాన్య జనానికి తెలియదు.
కెల్విన్ అరెస్ట్ కావడం, ఆ తర్వాత తీగ లాగితే డొంక కదిలిన చందాన సినీ పరిశ్రమకి చెందిన 12మందికి నోటీసులు అందడం తెల్సిన విషయాలే. 'జ్యోతిలక్ష్మి' సినిమా టైమ్‌లోనే ఛార్మి పుట్టినరోజు వేడుకల్లోనూ కెల్విన్ కన్పించడం గమనార్హం.